కేసీఆర్ మాత్రమేనా ? మోదీ కూడా తప్పులు మాట్లాడతారు కదా.. కవిత - MicTv.in - Telugu News
mictv telugu

కేసీఆర్ మాత్రమేనా ? మోదీ కూడా తప్పులు మాట్లాడతారు కదా.. కవిత

March 2, 2018

‘ కేసీఆర్ గారిది దేశ ప్రధానిని అవమానించేంత సంకుచిత మనస్థత్వం కాదు.. ఏదో పొరపాటున మాట తప్పుగా దొర్లింది అంతే.. ’ అన్నారు ఎంపీ కవిత. ఇటీవల ప్రధాని మోదీపై సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం కావడంతో ఎంపీ కవిత సంజాయిషీ ఇచ్చారు.

‘ రైతుల కష్టాలకు చలించి కేసీఆర్ గారు మోదీ అనబోయి ప్రసంగంలో తప్పు దొర్లింది. దాన్ని పట్టుకొని బీజేపీ నేతలు చిలువలు పలువలు చేయటం సరికాదు.  ఒక్కోసారి ప్రసంగాల్లో తప్పులు దొర్లడం సహజం. మోదీగారంతటి వారే ఒక సందర్భంలో తప్పుగా మాట్లాడారు.  600 కోట్ల మంది భారతీయులు తనకు ఓటేశారని అన్నారు. ప్రధానిని అవమానిస్తే దేశాన్ని అవమానించినట్టే అవుతుంది. ప్రధానిని ఉద్దేశపూర్వకంగా అవమానించే ఉద్దేశం లేదు ’ అని కవిత వివరణ ఇచ్చారు.

వ్యాపారానికి సంబంధించి 30 బిల్లులు ఇప్పటివరకు పెట్టారని, వ్యవసాయానికి సంబంధించిన ఒక్క బిల్లు కూడా పెట్టలేదని ఆరోపించారు. రైతు బడ్జెట్ అని చెప్పి రైతులకు కేటాయించిందేమి లేదని దుయ్యబట్టారు. విభజన చట్టంలోని ప్రతి హామీని కేంద్రం అమలు చేయాలని, ప్రత్యేక హోదాకు 2014 నుంచి మద్దతు ఇస్తున్నామని కవిత చెప్పారు. పార్లమెంట్‌లో హక్కుల సాధన తెలంగాణకు రావాల్సిన నిధుల కోసం మాట్లాడతామని కవిత చెప్పారు.

కేసీఆర్ వ్యాఖ్యలపై బీజేపీ సీనియర్ నేత బండారు దత్తాత్రేయ సైతం మండిపడిన విషయం తెలిసిందే. ఈ విషయంలో కేంద్రమంత్రి నిర్మలా రామన్ కేటీఆర్‌ను నిలదీశామని చెప్పారు. హైదరాబాద్‌లో కార్యక్రమానికి రావాలా వద్దా అని కేటీఆర్‌ను ప్రశ్నించినట్లు ఆమె చెప్పారు. ప్రధానిపై కేసీఆర్ ఉపయోగించిన పదజాలం సరికాదని మండిపడ్డారు. రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నవారు అలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.