పెద్దాపురం అంటే టూఊఊ కాదు.. నిజం ఇదీ! - MicTv.in - Telugu News
mictv telugu

పెద్దాపురం అంటే టూఊఊ కాదు.. నిజం ఇదీ!

March 12, 2018

పెద్దాపురం.. ఈ పేరు చెప్పగానే బ్యాగ్రౌండ్‌లో ఒక రకమైన మ్యూజిక్ వేసుకుని, కళ్ళల్లో బ్యాడ్ ఇమేజ్‌ను దర్శించుకుని.. ఓహ్ అదొక వన్నెల చిలకల సామ్రాజ్యం అని కైపుగా అనేస్తుంటారు. బాహువులు బిగుస్తుంటాయి.. పెదాలు పరాచికాలాడుతుంటాయి.. రసికత ముఖం మీద కనబడి వయ్యారాలు పోతుంటుంది.. ఎందుకు ? ఎవరు చెప్పారు? పెద్దాపురం పేరు చెప్పగానే పులకించిపోవాలని? పెద్దాపురం అంటే పైటేసిన పాపలేనా కన్పించేది ? పైట చాటున హృదయాలు కూడా వున్నాయని ఎవరు చూస్తారు ? దారినపోయే దానయ్య ముద్ర వేస్తే దాన్నింకా పట్టుకుని చిలువలు, పలువలు చేయటం ఎంతవరకు కరెక్టని నిలదీస్తోంది ‘మన పెద్దాపురం’ ఫేస్‌బుక్ పేజీ ప్రజాహృదయం.

పెద్దాపురానికి మసిపూసింది సినిమానేనా..

పెద్దాపురానికి అశ్లీల, బూతు.. నానా మనోవికారాల మసి పూసింది సినిమానేనా అంటే అవునని అంటున్నారు పెద్దాపురం ప్రజలు. సినిమాల్లో వ్యాంపు పాత్రలకు పెద్దాపురాన్ని తగిలించేశారు. అది అలా కంటిన్యూ అవుతూ చాలా సినిమాల్లో పెద్దాపురం అంటే అదొక వ్యాంపులుండే వూరని ముద్ర పడిపోయింది. సానులు అక్కడ కొలువై వున్నారని సింబాలిక్‌గా సినిమాలు చెప్పబట్టే ప్రతీ ఒక్కరూ పెద్దాపురాన్ని ఆ దృష్టికోణంతోనే చూశారు. కానీ పెద్దాపురం అంటే అది కాదు అసలు కథ వేరే వుందని ఫేస్‌బుక్ వేదికగా ‘మన పెద్దాపురం ’ గ్రూపు సభ్యులు గొంతెత్తి చెప్తున్నారు. ఆ కథ, వ్యథ వింటే ఎవరైనా పెద్దాపురానికి మసి పూసిన సినిమా మీద కాకరించి ఉమ్మేస్తాడు. మానని పుండులా ఆ ముద్రను ఎన్నో ఏళ్ళుగా మోస్తున్న పెద్దాపురం బాధ మాటల్లో వర్ణణాతీతం.

తనకు అంటుకున్న ఆ మసిని తుడిచేసుకొని తెల్లగా తళతళ మెరుస్తున్న తన హృదిని ఈ ప్రపంచానికి చాటి చెప్పాలని ఎన్నో ఏళ్ళుగా మనోవేదన పడుతోంది పెద్దాపురం. ‘ అటు చక్కని సంద్రం దరి.. ఇటు వన్నెల గోదావరి.. మరోవైపు మన్యపుసిరి.. మధ్యన మా పురం.. ముద్దుల గోపురం..’ అని దశదిశల తన ఔన్యత్వాన్ని చాటి చెప్పుకోవాలని పెద్దాపురం కొన్నేళ్ళుగా పడుతున్న వేదన ఇది.

పెద్దాపురం చరిత్ర :

ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పు గోదావరి జిల్లాలో వుంది పెద్దాపురం. చుట్టూ మెట్టల మధ్య చూడ ముచ్చటైన ప్రాంతం. పచ్చని పంటచేలు, సిరులిచ్చే వరి పొలాలతో, కోర్కెలు తీర్చే పుణ్యక్షేత్రాలతో అలరారుతోంది పెద్దాపురం. పెద్దాపురం పురాణ కథనాల ప్రకారం.. కుంతీదేవి తండ్రి కుంతీభోజుడు తన కూతురి పేరు మీద ఓ అందమైన నగరాన్ని నిర్మించాడు. దానికి ‘ పృథాపురం ’ అని పేరు పెట్టాడు. అలా పరిణామ క్రమంలో పృథాపురం కాస్త పెద్దాపురంగా మారిపోయింది. చారిత్రక గాథల ప్రకారం..పెద్దాపాత్రుడు అనే మహారాజు పెద్దాపురంలో కోట కట్టి పరిపాలన చేయటం జరిగింది. అందుకే అతని పేరుమీద ‘ పెద్దాపురం ’ గా పిలవబడింది. 

పెద్రాదాపురాన్ని 300 ఏళ్ళ పాటు వత్సవాయ వంశ క్షత్రియులు పాలించారు. వారిలో ముగ్గురు మహారాణులు వరుసగా పరిపాలించారు. వత్సవాయ లక్ష్మీనరసాయమ్మ, బుచ్చి సీతాయమ్మ, బుచ్చి బంగారమ్మ అను ముగ్గురు మహారాణులు ఏలిన మహా నగరంగా పెద్దాపురం ప్రసిద్ధి గాంచింది. బుచ్చి సీతాయమ్మ నిర్మించిన మహారాణి సత్రంలో ఇప్పటికీ నిత్యాన్నదానం జరగటం విశేషం.

సముద్ర మట్టానికి 40 అడుగుల ఎత్తు వున్న ఈ నగరం ఒక షాన్‌దార్ నగరాన్ని తలపిస్తూంది. ‘ భర్తృహరి సుభాషితా’ ను తెలుగులోకి అనువదించిన ముగ్గురు కవుల్లో ఏనుగు లక్ష్మణకవి పృథానగరానికి చెందినవారే అవటం విశేషం. పాండవులు నడయాడిన పుణ్యక్షేత్రం అని పురాణ కథలు చెప్తున్నాయి.  జాతిపిత గాంధీ సందర్శించిన నగరమిది. తెలుగులో వచ్చిన మొట్ట మొదటి నవల ‘ రాజశేఖర చరిత్ర’ లో పెద్దాపురం ప్రస్తావన వుండటం విశేషం. బౌద్ధం సైతం వెలసిల్లిన ధర్మక్షేత్రం అని చరిత్ర కథలు చెప్తున్నాయి. ప్రముఖ దివంగత నటి అంజలీదేవి పెద్దపురంలోనే జన్మించారు. అలాగే తెలుగు చిత్రసీమలో వెలుగొందిన గోకిన రామారావు (నటుడు), ఈశ్వరీరావు (నటి), మేడిశెట్టి శివగణేష్ బాబు ( లిరిసిస్ట్) వంటి ప్రముఖులు పెద్దాపురంలో జన్మించినవారే.అలాగే ఎందరో పేరుమోపిన కవులు కూడా పెద్దాపురంలో జన్మించారు. వేదుల సత్యనారాయణ శాస్త్రి, అల్లంరాజు లక్ష్మీపతి, మళ్యాల జయరామయ్య, మధునాపంతుల పరమయ్య, పంపన సూర్యనారాయణ, వత్సవాయ రాయ జగపతి వర్మ, వేదుల కామేశ్వరరావు తదితరులు. వీరితో పాటు ఎందరో రచయితలు కూడా ఈ గడ్డ నుంచి తమ రచనా సుగంధాలను పరివ్యాప్తం చేశారు. విస్సా అప్పారావు, భావరాజు సర్వేశ్వరరావులు జాతీయ స్థాయిలో అవార్డులు పొందిన ఉద్ధండ రచయితలు. వీరే గాకుండా క్యాసవరపు కామరాజు, దుర్వాసుల వేంకట సుబ్బారావు, మాడూరి అన్నపూర్ణమ్మ వంటి స్వతంత్ర సమరయోధులను కన్న పెద్దాపురం చరిత్ర ఎంతో ఘనమైంది. ప్రస్తుతం లండన్ ఎగ్జిబిషన్‌లో పెద్దాపురం ఇత్తడి లోహాలతో తయారుచేసిన సైనికవ్యూహాన్ని ప్రదర్శిస్తున్నారంటే అదెంత గొప్ప విషయమో ఎవరికివారు అంచనా వేసుకోవచ్చు.  

మన పెద్దాపురం :

తనమీద పడ్డ చెడ్డపేరును కడిగేసుకొని ఇదీ నేనంటే అని చెప్పాలనుకుంటోంది పెద్దపురం. ఈ నేపథ్యంలోంచే వచ్చింది ‘ మన పెద్దాపురం ’ ఫేస్‌బుక్ గ్రూప్. నరేశ్ పెద్దిరెడ్డి, వంగలపూడి శివకృష్ణలు కలిసి ఈ గ్రూపును స్థాపించారు. 29 – 03 – 2015 న ‘మన పెద్దాపురం’ గ్రూపు ప్రారంభమైంది. అనతి కాలంలోనే 20 వేల మంది ఇందులో భాగస్వాములయ్యారు. వివిధ సేవా, జానపద కార్యక్రమాల ద్వారా పెద్దాపురం ఔన్యత్యాన్ని దశదిశల చాటుతున్నారు.

పెద్దాపురం యొక్క ప్రాచీన చరిత్రను నిరంతరం తెలియజేయడం ద్వారా పెద్దాపురం వాసులకి పెద్దాపురం పేరు చెప్పుకోవడానికి ఉన్న ఆత్మన్యూనతా భావాన్ని రూపుమాపటం.. ఇతర ప్రాంతాల వారికి పెద్దాపురంపై నెలకొని ఉన్న దురాభిప్రాయాన్ని శాశ్వతంగా తొలగించడం. చిన్న పాటి సేవా కార్యక్రమాల ద్వారా పెద్దాపురం అభివృద్ధిలో యువతను భాగస్వాములను చేయడం.. లక్ష్యంగా మన పెద్దాపురం గ్రూప్ పనిచేస్తుంది.

మన పెద్దాపురం  గ్రూప్ చేసిన సేవా కార్యక్రమాలు :

02/10/2015 గాంధీ జయంతి సందర్భంగా ప్రాంతీయ ఆస్పత్రికి  నెబ్యులైజర్, బి. పి ఆపరేటర్ పరికరాలు, రోగులకు పండ్లు పంపిణీ…

13-12-2015 మహా రక్తదాన శిబిరం ( రక్తదాతలు 175 మెంబర్లు )

29-03-2016 చారిత్రక నడక (వెంకటేశ్వర స్వామి గుడి నుండి మునిసిపల్ ఆఫీస్ వరకూ – పెద్దాపురం చరిత్ర పాట విడుదల)

05-06-2016 పర్యావరణ పరిరక్షణ దినోత్సవం (మెయిన్‌రోడ్డు ఆంజనేయస్వామి గుడి వద్ద 1000 మొక్కలు పంపిణీ )

13-08-2016 ప్రాణదాన ఉద్యమం – 2016 (2000 మందితో అవయవదాన అంగీకార పత్రాలపై సంతకాల సేకరణ)

29-08-2016 తెలుగుభాషా దినోత్సవ వేడుకలు (56 అక్షరాలు 56 మొక్కలు)

04-09-2016 మట్టి గణపతే మహా గణపతి (2000 మట్టి గణపతి విగ్రహాల పంపిణీ)

02-10-2016 చారిత్రక గాంధీ విగ్రహ పునః స్థాపన (ఆ రోడ్డుకి మహాత్మా గాంధీ రోడ్డుగా నామకరణ)

09-10-2016 స్వచ్ఛసైన్యం (CLEAN ARMY పేరుతో పట్టణంలోని 7 బస్టాప్‌ల సుందరీకరణ)

16-10-2016 దత్తత వార్డుల పరిశుభ్రతా కార్యక్రమాల పనులకు శ్రీకారం (21వ వార్డుతో మొదలు)

18-12-2016 గ్రీన్‌బ్లడ్ డొనేషన్ క్యాంపు (రక్తదాతలు100 మెంబర్స్)

01-01-2017 వెన్నుముక వ్యాధి పీడితుడు బొగ్గు బాలాజీకి శాశ్వతగూడు (Rs. 1, 70, 000 ఆర్ధిక సహాయం )

14/04/2017 రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేడ్కర్ గారి విగ్రహానికి రంగులు వేయడం

01/05/2017 నిరోగి వెంకట సుబ్బారావు, పెద్దాపురం కార్మిక పక్షపాతి చైర్మన్ విగ్రహం పునస్థాపన

02/07/2017 సమానత్వపు గోడ (వాల్ అఫ్ హ్యుమానిటీ & ఈక్వాలిటీ) పనులు ప్రారంభం

01/10/2017 ఆంధ్రరాష్ట్ర అవతరణకు కృషి చేసిన పొట్టి శ్రీరాములు విగ్రహ పునస్థాపన

19/11/2017 పచ్చదనం కోసం పదిగంటలు  500 మొక్కలను పెద్దాపురంలో నాటడం

20/11/2017 మానవత్వపు హుండీ – నిరుపేదలకు జీవనోపాధి లేని వారికి సహాయం అందించే లక్ష్యంతో

క్రీడాకారులకు ప్రోత్సాహం : పల్లెటూర్లలో షటిల్ బాడ్మింటన్ పోటీలు… అథ్లెట్ క్రీడాకారులకు స్పోర్ట్స్‌షూ… ప్రోటీన్ ఫుడ్

ఎడ్యుకేషన్ వింగ్ : ఆర్ధిక కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన వారిని చదివించడం.. విద్యాలయాలకు నోటు పుస్తకాలు గైడ్లు పంపిణీ చేసి పరీక్షలకు మానసికంగా సిద్ధం చేయడం.. విద్యాలయాల కళాశాలల వార్షికోత్సవాలు నిర్వహించడం..

షేర్ యువర్ నాలెడ్జ్ : మనకు తెలిసిన మనం నేర్చుకున్న విద్య  నేటి విద్యార్థులకు నేర్పించడం మరియు వ్యక్తిత్వ వికాసపు క్లాసులు తీసుకోవటం.

నివాళులు :  బోర్డర్లో జవానులు మరణం… కార్పొరేట్ కళాశాలలో విద్యార్థుల మరణం.. ఘోరక్‌పూర్ చిన్నారుల మరణానికి మహిళలపై జరుగుతున్న వివక్షతలకు వ్యతిరేకంగా సభలు సమావేశాలు ఏర్పాటుచేసి ప్రముఖుల చేత ఉపన్యాసాలు… కవి సమ్మేళనాల ఏర్పాటు… మొదలైనవి

క్లీన్ ఆర్మీ ప్రారంభించిన నాటి నుండీ నేటి వరకూ (40 వారాలపాటు) నిర్విరామంగా, నిరాటంకంగా :

పెద్దాపురం పరిశుభ్రత కార్యక్రమాలు

ప్రతీరోజూ పెద్దాపురం చరిత్ర పరిచయం

ప్రతీ సమస్య పైనా చర్చ, స్పందన…

ప్రతీ ఒక్కరికీ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు

ప్రతీ అనారోగ్యానికి చిట్కాలందిస్తున్నారు

ప్రతీ పెద్దాపురం వార్తా గ్రూపులో చేరవేస్తున్నారు

ప్రతీ నిముషం అందుబాటులోనే ఉంటారు

రక్తదానం చేస్తున్నారు

ప్రతీ సేవా కార్యక్రమంలో పాలుపంచుకుంటున్నారు

ప్రతీ వార్డూ పరిశుభ్రంగా ఉండాలని ఆశిస్తున్నారు

కులం లేదు మతం లేదు మా పెద్దపురం యువత అంతా ఒక్కటే

ఏక తాటి పై ఉన్నా … చిత్తశుద్దితో ఉన్నారు …

అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటూ అందరికీ అండగా ఉంటారు

అవయవ దానం చేస్తూ శాశ్వతంగా జీవిస్తాం ధరిత్రి లోనూ… చరిత్రలోనూ అంటూ ముందుకు సాగుతున్నారు గ్రూపు సభ్యులు.

రెండు వసంతాలు దాటి మూడో వసంతంలోకి ప్రవేశిస్తున్న ‘ మన పెద్దాపురం ’ ఫేస్‌బుక్ గ్రూపు మానవత్వాన్ని బ్రతికించే బాటలో ముందుకుపోతూ, మరిన్ని వసంతాలు జరుపుకోవాలని కోరుకుందాం. అందరి ప్రోత్సాహం ఇలానే వుండాలని సదా ఆశిస్తున్నారు వారు.

జై పెద్దాపురం…. జైజై పెద్దాపురం….

https://www.facebook.com/groups/ManaPeddapuram/