రోడ్డెక్కిన 20 వేలమంది అన్నదాతలు - MicTv.in - Telugu News
mictv telugu

రోడ్డెక్కిన 20 వేలమంది అన్నదాతలు

November 21, 2018

ఈ ఏడాది మార్చ్ నెలలో ఎండుటెండల్లో 50 వేల మంది మహారాష్ట్ర కరువు పీడిత రైతులు నాసిక్ నుండి ముంబయికి పాదయాత్రగా వెళ్లిన సంగతి తెలిసిందే. మహారాష్ట్ర రైతులు గత కొంత కాలంగా తీవ్ర అనావృష్టి పరిస్థితులను ఎదురుకుంటున్నారు. కరవు పీడిత ప్రాంతాలను ప్రభుత్వం ఆదుకోవడంలేదు. దీంతో రైతన్న మళ్ళీ రోడ్డెక్కాడు. కరవు పీడిత ప్రాంతాల రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని, రుణ మాఫీ చేయాలని కోరుతూ భారీ ర్యాలీ చేపట్టారు. దాదాపు 20వేల మంది రైతులు కాలినడకన థానే నుంచి ముంబయికి బయలుదేరారు. ప్రభుత్వం సహాయం కోరుతూ పలు డిమాండ్లు చేస్తున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు థానె నుంచి బయలుదేరారు. ఈరోజు సాయంత్రం 5 గంటలకు వారు ముంబయిలోని సోమయ్య మైదానానికి చేరుకుంటారు. గురువారం నగరంలోని ఆజాద్‌ మైదానానికి చేరుకోవడంతో వీరి ర్యాలీ ముగుస్తుంది. అనంతరం రైతులు అక్కడే భైఠాయిస్తామని తమ డిమాండ్ల నెరవేరే వరకు ఆజాద్‌ మైదానంలోనే కూర్చుంటామని హెచ్చరించారు.ఈ ర్యాలీని లోక్‌ సంఘర్ష్‌ మోర్చా ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఈ ర్యాలీకి నీటి పరిరక్షణ కార్యకర్త రాజేంద్ర సింగ్‌, స్వరాజ్‌ ఇండియా నేత యోగేంద్ర యాదవ్‌ నాయకత్వం వహిస్తున్నారు. ఆందోళనల నేపథ్యంలో ముంబయిలో ట్రాఫిక్‌ జామ్‌లు అయ్యే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలను పాటిస్తోందని, రైతులకు ధర్నా చేయడం తప్ప మరో అవకాశం లేకుండా పోయిందని మోర్చా జనరల్‌ సెక్రటరీ పత్రిభా షిండే తెలిపారు.