సొంత పార్టీయా.. జనసేనలోకా.. జేడీ అడుగులు ఎటువైపు ? - MicTv.in - Telugu News
mictv telugu

సొంత పార్టీయా.. జనసేనలోకా.. జేడీ అడుగులు ఎటువైపు ?

March 23, 2018

వచ్చే ఏడాదే సార్వత్రిక ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలో సీబీఐ మాజీ జాయింట్ డైరెక్టర్ లక్ష్మీనారాయణ రాజకీయాల్లోకి రానున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటి నుంచే రాజకీయాల్లో చురుగ్గా ఉంటే బాగుంటుందన్న ఆలోచనతోనే ఈ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు సమాచారం. అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్ కేసులు, గాలి జనార్దన్ రెడ్డి ఓబుళాపురం మైనింగ్ కార్పొరేషన్‌కు సంబంధించి అక్రమ వ్యాపారాల కేసులతో బాగా పాపులారిటీ సంపాదించుకున్న జేడీ లక్ష్మీనారాయణకు.. ప్రజల్లో మంచి ఫాలోయింగే ఉంది. మరి, ఆ ఫాలోయింగ్‌తో ఆయన రాజకీయాల్లోకి రావటానికి ఉపయుక్తం అవుతుందా లేదా.. కొన్నాళ్లు వేచి చూడాల్సిందే. పవన్ కల్యాణ్ జనసేన పార్టీలోకి వెళ్లే ఆలోచనలో ఉన్నట్టు కథనాలు వినిపిస్తున్నాయి.ఆ కథనాలకు తగినట్టుగానే గురువారం ఆయన తన ఉద్యోగం నుంచి స్వచ్ఛంద పదవీ విరమణ పొందారు. ప్రస్తుతం మహారాష్ట్ర అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆయన.. మహారాష్ట్ర డీజీపీకి తన వీఆర్ఎస్ పత్రాన్ని సమర్పించారు. మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌లా జేడీ కూడా సొంతంగా పార్టీ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు చెబుతున్నారు. ఒకవేళ అది వీలుకాకపోతే పవన్ కల్యాణ్ పెట్టిన జనసేన పార్టీతో పాటు తన రాజకీయ ప్రయాణాన్ని ప్రారంభించాలని ఆయన యోచిస్తున్నట్టు తెలుస్తోంది.