రూ.60 లక్షల టాక్స్ కట్టిన పకోడీవాలా… - MicTv.in - Telugu News
mictv telugu

రూ.60 లక్షల టాక్స్ కట్టిన పకోడీవాలా…

October 7, 2018

రోడ్ సైడ్ పకోడీ షాపు పెట్టుకున్నవాడు రూ.60 లక్షల పన్ను కడతాడా అంటే నమ్మగలమా? లేదుకదా.. కానీ ఓ పకోడీ వ్యాపారి కట్టాడు. ఆశ్చర్యానికి గురిచేస్తున్న ఈ ఘటన పంజాబ్‌లోని లూథియానాలో చోటు చేసుకుంది. పన్నాసింగ్‌ అనే వ్యక్తి 1952లో చిన్న వీధి కొట్టుగా పకోడి షాపును పెట్టుకున్నాడు. అతని చేతివాటమో ఏంటోగానీ పకోడీ రుచి చాలా మందికి నచ్చింది. ఇంకే గిరాకీకి కొదువలేదు. ఆ పకోడీకి పడి చచ్చేవారిలో సామాన్యులే కాదు… రాజకీయ నాయకులు, పెద్ద పెద్ద సెలబ్రిటీలు, డబ్బున్నవాళ్ళు రాసాగారు.

Rs 60 lakh tax paid for pakodiwala …

అతి తక్కువ సమయంలోనే అతని వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా అభివృద్ధి చెందింది. అయితే ఇంత పెద్ద వ్యాపారం నడిపిస్తున్న అతను కట్టే పన్ను మాత్రం చాలా తక్కువ. దీంతో ఇన్‌కమ్‌టాక్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే రికార్డులన్నీ ముందేసుకుని పరిశీలించారు. దీంతో అతను పన్ను కట్టకుండా ఎగ్గొడుతున్నాడని తేలింది. అధికారులు ఊరుకుంటారా.. ముక్కు పిండిమరీ వసూలు చేశారు. అతడితో రూ.60 లక్షలు పన్ను కట్టించారు. ఇదిలావుండగా…  లూథియానాలోనే మరో ప్రబుద్ధుడు కోటి రూపాయల పన్ను కట్టాడు. అతను డ్రైఫ్రూట్స్‌ వ్యాపారం చేస్తాడు. షాపులో సోదా చేసిన అధికారులకు అతను చేసిన నిర్వాకం బయటపడింది. దీంతో అతనిచేత కోటి రూపాయల పన్ను కట్టించారు.

సదరు వ్యాపారస్తులు సకాలంలో పన్ను చెల్లిస్తే ఇంతమొత్తంలో చెల్లించామనే బాధ వుండదు కదా అంటున్నారు అధికారులు.