కన్నవాళ్లు కఠినం.. ఆడబిడ్డ పుట్టిందని పాలు కూడా ఇవ్వకుండా… - MicTv.in - Telugu News
mictv telugu

కన్నవాళ్లు కఠినం.. ఆడబిడ్డ పుట్టిందని పాలు కూడా ఇవ్వకుండా…

January 9, 2019

బేటీ బచావో.. బేటీ పడావో అని కేంద్ర ప్రభుత్వం ఎంత మొత్తుకున్నప్పటికీ కొందరింకా అజ్ఞానంలోంచి బయటకు రావడంలేదు. ఆడపిల్లను ఇంకా భారంగానే భావిస్తున్నారు. ఆమె లేకపోతే జీవితమే లేదని భావించకుండా పైశాచికాలకు పాల్పడుతున్నారు. తాజాగా అలాంటి ఓ ఘటనే నల్గొండ జిల్లా దేవరకొండ ప్రభుత్వాసుపత్రిలో చోటు చేసుకుంది. పదో కాన్పులో పుట్టిన ఆడబిడ్డను వదిలించుకోవాలని చూశారు కన్నవాళ్ళు. గుక్కపట్టి ఏడుస్తున్న పాపాయికి పాలు కూడా పట్టనంత కర్కషంగా ప్రవర్తించారు.

Telugu news Parents are hard .. The girl is born without giving milk.

నల్గొండ జిల్లా చందంపేట మండలం మోత్య తండాకు చెందిన ఇస్లావత్‌ రాజు తన భార్య సావిత్రిని మంగళవారం ఉదయం దేవరకొండ ఆస్పత్రికి తీసుకొచ్చాడు. అప్పటికే వారికి తొమ్మిది మంది సంతానం (ముగ్గురు కుమారులు, ఆరుగురు కుమార్తెలు) వున్నారు.  ఆసుపత్రిలో పదో కాన్పులో ఆడబిడ్డకు జన్మనిచ్చిందామె. పదో కాన్పులో కూడా మళ్లీ ఆడపిల్లే పుట్టిందని కుటుంబ సభ్యులందరూ ఆ చిన్నారి మీద వివక్ష చూపడం ప్రారంభించారు. పాప గుక్కపట్టి ఏడుస్తున్నా పాలు పట్టుకుండా వుండిపోయారు. ఏడ్చి ఏడ్చి చచ్చిపోతే బాగుండన్నంత కఠినంగా వ్యవహరించారు. కనీసం తల్లి హృదయం కూడా పాప ఏడుపులకు కరగలేదు. దీంతో ఇరుగుపొరుగు బాలింతలు, గర్భిణులు పాలు పట్టాలంటూ చెప్పినా వాళ్లు కనికరించలేదు. చివరికి వాళ్లే పోతపాలు పట్టి బిడ్డ ఏడుపు మాన్పించారు.

అంతటితో ఆగకుండా వాళ్లు ఆ పాపాయిని విక్రయించి చేతులు దులుపుకోవాలనుకున్నారు. ఈ విషయం తెలిసి ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్‌ వెంకటమ్మ ఆస్పత్రికి చేరుకున్నారు. తల్లిదండ్రులను కూర్చోబెట్టి నచ్చజెప్పారు. శిశువుకు హాని తలపెట్టినా, శిశువు అదృశ్యమైనా మానవ అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేస్తామని బిడ్డ తండ్రి రాజును హెచ్చరించారు. దీంతో అతను ఆగ్రహంగా కేసే నమోదు చేసుకోండి, ఇంకా ఏమైనా చేసుకోండని వాగ్వాదానికి దిగాడు. పోలీసులు రావడంతో బిడ్డను ఇంటికి తీసుకెళ్ళారు.

ఇదిలావుండగా నేరడుగొమ్ము మండలం మోసంగడ్డ తండాలో, ఉస్మాన్‌కుంటలో ఇద్దరు ఆడశిశువులు మాయమయ్యారని ఐసీడీఎస్‌ అధికారులకు ఫిర్యాదు అందింది. దత్తత, రిజిస్ట్రేషన్ల పేరిట హైదరాబాద్‌లో ముఠా పనిచేస్తోందన్న అనుమానాలున్నాయని సూపర్‌వైజర్‌ వెంకటమ్మ తెలిపారు. ఈ ముఠా ద్వారా శిశువుల విక్రయం జరుగుతున్నట్టు అనుమానిస్తున్నామని వివరించారు. Telugu news Parents are hard .. The girl is born without giving milk