పవన్ కల్యాణ్.. తెలిసే మాట్లాడుతున్నావా? - MicTv.in - Telugu News
mictv telugu

పవన్ కల్యాణ్.. తెలిసే మాట్లాడుతున్నావా?

February 8, 2018

‘పవన్ కల్యాణ్‌కు సమస్యలపై అవగాహన లేదు. నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడు.. అతని మాటలతో  రాష్ట్రంలో కుల చిచ్చు మొదలైంది’ అని భగ్గుమంటున్నాయి ఏపీ గిరిజన సంఘాలు. మత్స్యకారులను ఎస్టీల్లోకి చేర్చాలన్న పవన్ కల్యాణ్ డిమాండ్ సరికాదంటున్నాయి.  ఆయన మాట్లాడిన తీరు వల్ల ఒరిగేదేమీ లేకపోగా.. జాలర్లకు, ఎస్టీలకు మధ్య అనవసరంగా  చిచ్చు రేగిందని  ఆరోపిస్తున్నాయి.

వివాదంలోకి వెళ్తే.. గత అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ కొన్ని కులాల వారిని ఎస్టీల్లోకి కలుపుతామని హామీని ఇచ్చింది. రాయలసీమలో అధికంగా ఉండే బోయలను ఎస్టీల్లోకి మారుస్తామని చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇప్పటి వరకూ అవేవీ జరగలేదు. తాజాగా  పవన్ కల్యాణ్ మత్స్యకారులను ఎస్టీల్లో చేర్చాలని,  అందుకోసం వారికి మద్దుతుగా ఆందోళన చేస్తానని అన్నారు. దీంతో గిరిజనులు ఆయనపై నిప్పులు చెరుగుతున్నారు.

దీనిపై పవన్ వివరణ ఇచ్చారు. జాలర్లను ఎస్టీల్లో చేరుస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, తాను కాదని  అన్నారు. జాలర్ల నేతలు తనను కలుసుకోగా వారికి మద్దతు ప్రకటించానని చెప్పారు. గిరిజనులకు అన్యాయం జరగనివ్వననీ అన్నారు. ఈ పొంతన లేని వ్యాఖ్యలు మరింత  గందరగోళానికి దారితీశాయి. ఆయన వివరణతో ఆదివాసులు తృప్తి పడ్డం లేదు. పవన్ కల్యాణ్ శ్రీకాకుళం పర్యటనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  గిరిజన ఐక్యవేదిక ఈమేరకు ప్రకటన చేసింది.  పవన్ పర్యటనను  బ్లాక్ డేగా ప్రకటిస్తున్నామని, అతని దిష్టి బొమ్మల దహనం కార్యక్రమాన్ని చేపడతామని తెలిపింది.

పవన్ కల్యాణ్ చాలా అవివేకంగా, అవగాహన లేమితో ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారని గిరిజన సంఘాలు మండిపడుతున్నాయి. ఎస్టీల్లోకి కొత్త కులాలను కలపడాన్ని ఆదివాసీలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.  పవన్ కల్యాణ్ మద్దతు ప్రకటించినంత మాత్రాన మత్స్యకారులను గిరిజనల్లోకి చేర్చడం జరిగే పని కాదంటున్నారు. పవన్ కల్యాణ్ శ్రీకాకుళం పర్యటన సందర్భంగా ఒకవైపు కుల రహిత సమాజం.. అంటూ మాట్లాడే పవన్ కల్యాణ్, అలా ఒక కులం తరఫున మాట్లాడి.. మరో కులస్తులను నిరుత్సాహ పరస్తున్నాడని.. రాష్ట్రంలో మరో కుల చిచ్చు అయితే మొదలైనట్టేనని అంటున్నారు.