‘ అయ్యో నాకింకా పెళ్ళే కాలేదు అప్పుడే బట్టతల వచ్చేసింది ఛ… నా బాల్డ్ హెడ్డును చూసి ఏ అమ్మాయి ప్రేమిస్తుంది…’, ‘నా భర్తకు బట్టతల వుంది ఛ… పెళ్లిచూపుల్లో సరిగ్గా చూడలేదు.. ’.. ఇలా ఇకనుండీ ఎవరూ బాధ పడాల్సిన అవసరం లేదంటున్న జపాన్ పరిశోధకులు. జట్టును తిరిగి మొలిపించే కణజాలాన్ని.. పెద్ద మొత్తంలో ఉత్పత్తి చేసే కొత్త పద్ధతిని అభివృద్ధి చేశామని ప్రకటించారు. వెంట్రుక పెరగడానికి, నిలిచి ఉండటానికి ఫోలికల్ అనే సూక్ష్మ కణసమూహం అవసరం. దీని పునరుత్పత్తి వనరు అయిన హెయిర్ ఫోలికల్ జెర్మ్ (హెచ్ఎఫ్జీ ) అంకురాలను ఉత్పత్తి చేయడంపై యొకహామా నేషనల్ వర్సిటీ పరిశోధకులు దృష్టిసారించారు.దీన్ని కనిపెట్టడానికి వారంతా చాలా రోజులు శ్రమించామంటున్నారు. జట్టు రాలే సమస్యతో బాధపడుతున్నవారి కోసం.. మెరుగైన చికిత్స విధానాలను కనిపెట్టేందుకు ఈ పరిణామం దారితీసే అవకాశముందనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కణోత్పత్తి పాత్రలో ఆక్సిజన్ పెర్మేబుల్ డైమిథైల్పాలిసిలాక్సోన్ను తీసుకుని.. హెచ్ఎఫ్జీలను పెద్ద మొత్తంలో వారు ఉత్పత్తి చేయగలిగారు. వీటిని ఎలుకల శరీరం మీదకి మార్చి.. వెంట్రుకలను మొలిపించగలిగారు. కొత్తగా ఏర్పడిన వెంట్రుకలూ సహజ లక్షణాలనే కనబరిచాయి. మానవులకు సంబంధించి కెరాటినోసైట్స్, పాపిల్లా కణాలను ఉపయోగించి హెచ్ఎఫ్జీలను తయారు చేసేందుకు అవకాశముందని వారు చెప్తున్నారు.
బట్టతల అనేది మగవారిని తీవ్రమైన మానసిక సంఘర్షణకు గురి చేస్తున్న అంశం. దీని పరిష్కారానికి హెయిర్ ప్లాంటేషన్ ఒకటే దారిగా వుంది. కానీ అది ఖరీదైన చికిత్స అవటంతో చాలా మంది మధ్య తరగతి మగవాళ్ళు తమకున్న బట్టతలను పదే పదే అద్దంలో చూస్కుంటూ నెర్వస్‌గా కాలం వెళ్ల దీస్తున్నారు. జపాన్ శాస్త్రవేత్తల ప్రయోగం చాలా మందిని ఆనందానికి గురి చేస్తున్నది.