సోషల్ మీడియా ప్రభావంతో ఉత్తరాలు కాలగమనంలో కనుమరుగైపోయాయి. కానీ ఉత్తరాల కోసం ఉపయోగించిన పోస్ట్ బాక్సులు మాత్రం ఇంకా వాటి స్థానాల్లోనే వున్నాయి. అయితే వాటిని కొందరు జేబుదొంగలు ఎలా వాడుకుంటున్నారో తెలిస్తే షాక్ అవాల్సిందే. గతంలో అయితే వాటిని తెరిస్తే ఉత్తరాలు బయటకు వచ్చేవి. కానీ ఇప్పుడు వాటిని ఓపన్ చేస్తే ఖాళీ పర్సులు, ఆధార్ కార్డులు, ఓటర్ ఐడీ కార్డులు లభిస్తున్నాయి. ఆశ్చర్యంగా వుంది కదూ. అవన్నీ వీటిలోకి ఎలా వస్తున్నాయంటే.. దొంగలు పర్సులు కొట్టేసి వాటిలోని క్యాష్ తీసేసుకుని ఖాళీ పర్సును పోస్ట్బాక్సులో పారేస్తారన్నమాట.
వాటిలోని గుర్తింపు కార్డులతోని వాళ్ళకు అవసరం ఏముంటుంది. అందుకే వాటిని తేరగా వున్న పోస్ట్ బాక్సులో పారేస్తున్నారు. ఈ వింత ఘటన చెన్నైలో జరిగింది. గత 6 నెలల్లో వివిధ పోస్టు బాక్సుల నుంచి ఇటువంటి 70 ఐడీ కార్డులు లభ్యమవడాన్ని పోస్టల్ అధికారులు గుర్తించారు. పోస్టల్ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం… ఇటీవలి కాలంలో దొంగలు పోస్ట్ బాక్సులను ఇలా వాడుకుంటున్నారు. ఓటర్ కార్డులు, డీఎల్, ఆధార్ కార్డులు, ప్యాన్ కార్డులు పోస్టుబాక్సులలో లభ్యమవుతున్నాయి. ఇది ఖచ్చితంగా జేబుదొంగల పనేనని అంటున్నారు.