తిరుమల గుడివద్ద పందుల హల్‌చల్ - MicTv.in - Telugu News
mictv telugu

తిరుమల గుడివద్ద పందుల హల్‌చల్

December 3, 2017

స్వచ్ఛభారత్‌ అంటూ వందల కోట్లు పెట్టి ప్రచారం చేస్తున్నా.. పందులపై పన్నీరు పోసినట్లు అవుతోంది. తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి ఆలయం ముందు మాడవీధుల్లో పందులు గుంపులు గుంపులుగా తిరుగుతూ హల్ చల్ చేశాయి. తరుముతున్నా పట్టించుకోకుండా గుడి ముందే తిరిగాయి. ఇది చూసి భక్తులు నోరెళ్లబెట్టారు. వాటిని తప్పించుకోవడానికి పరుగులు పెట్టారు.

శనివారం పొద్దున 6 గంటల సమయంలో ఏడు పందుల గుంపులు శ్రీబేడి ఆంజనేయస్వామి ఆలయం నుంచి కిందకు దిగి ఆలయం వైపుకు వచ్చాయి. అక్కడి తినడానికి ఏమీ లేకపోవడంతో మళ్లీ దక్షిణ మాడవీధిలో చక్కర్లు కొట్టాయి. వెంకన్న విగ్రహాలను ఊరేగించే ఈ వీధుల్లో మనుషులు తిరగొద్దనే నిషేధం ఉంది. దీంతో సిబ్బంది ఆవైపు దృష్టి పెట్టలేదు. భక్తులు ఈ విషయాన్ని టీటీడీ సిబ్బందికి చెప్పడంతో వారు ఆపసోపాలు పడి పందులను పక్కకు తరిమేశారు. అయితే పందులు విష్ణుమూర్తి అవతారమని.. అవి గుడి వద్దకు రావడానికి ఏదో ఒక బలమైన ఆధ్యాత్మిక కారణం ఉంటుందని కొందరు భక్తులు చెబుతున్నారు. అడవుల్లో ఆహారం దొరక్క అవి గుడివైపు వచ్చి ఉంటాయని సిబ్బంది చెబుతున్నారు.