దమ్ముంటే మూవీరూల్జ్‌‌ ఈకలు పీకండి..! - MicTv.in - Telugu News
mictv telugu

దమ్ముంటే మూవీరూల్జ్‌‌ ఈకలు పీకండి..!

April 23, 2018

సినిమా విడుదలకు ముందే వెబ్‌సైట్లలో దర్శనమిస్తే ఎలా వుంటుంది ? అప్పనంగా చూసేవాళ్ళు చంకలు గుద్దుకుని చూడొచ్చునేమో గానీ సినిమాను నిర్మించిన నిర్మాత మాత్రం బాధ పడాల్సిన పరిస్థితే. కానీ ఆయా వెబ్‌సైట్లవాళ్ళకి నిర్మాతల గోడు పట్టడం లేదు. చాలా ఏళ్ళుగా ఈ పైరసీ భూతం సినిమా ఇండస్ట్రీని వదలకుండా పట్టుకుంది. నిర్మాతలు పెట్టిన పెట్టుబడి రాకపోగా నష్టాలను మూటగట్టుకుంటున్నారు. దీన్ని సమూలంగా నిర్మూలించాలని  పోరాటం జరుగుతున్నప్పటికీ ఫలితం మాత్రం హళ్లికి హళ్లి సున్నకు సున్నా. అప్పట్లో వీసీఆర్ క్యాసెట్లు, తర్వాత డీవీడీలు, ఇప్పుడు ఇంటర్నెట్టు రూపంలో సినిమాలను వెంటాడుతోంది పైరసీ.

అప్పుడే విడుదలైన సినిమాను వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేస్తున్న ‘ మూవీ రూల్జ్ ’ వెబ్‌సైట్‌ను ఎవరూ ఎందుకు పట్టించుకోవటంలేదు ? విడుదలైన గంటల్లోనే కొత్త కొత్త సినిమాలు ఈ వెబ్‌సైట్‌లో దర్శనమిస్తున్నాయి. అయినా ఎవరూ దాని మీద చర్యలు తీసుకున్న దాఖలాలు కనిపించటం లేదు. టాలీవుడ్‌లో ప్రస్తుతం పెద్ద కోలాహలమే నెలకొని వుంది. ఎదైతే జరుగుతోందో అది అంతర్గత సమస్య. కానీ పైరసీ అనేది బహిరంగ సమస్య కదా. సినీరంగాన్ని నట్టేట ముంచే ఇంలాంటి చర్యల మీద టాలీవుడ్ ప్రముఖులు ఇంకా ఉక్కుపాదం ఎందుకు మోపటంలేదు. ‘ ఒక్కడు ’ సినిమా విడుదలైన సందర్భంలో మహేష్ బాబు పైరసీకి పాల్పడుతున్నవారి మీద చర్యలు తీసుకున్నాడు. ‘ అజ్ఞాతవాసి ’ ‘ ఎమ్‌సీఏ ’ సినిమాల విషయంలో కూడా పైరసీ చేస్తామని పైరసీకారులు బెదిరింపులకు కూడా దిగారు. అప్పుడు సదరు రెండు సినిమాల నిర్మాతలు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించిన విషయం తెలిసిందే.

అప్పుడు పోలీసులు రంగప్రవేశం చేసి ముగ్గురు పైరసీ ముఠా సభ్యులను అరెస్ట్ కూడా చేశారు.

ఇన్ని జరుగుతున్నా ఈ వెబ్‌సైట్ మాత్రం ఏమాత్రం జంకకుండా సినిమాలను అప్‌లోడ్ చేస్తోంది. ఎందుకు ఆ వెబ్‌సైట్ మీద చర్యలు తీసుకోవటం లేదెవ్వరు. ఆ వెబ్‌సైట్‌ అప్పటికప్పుడు తోక పేర్లు మార్చుకుంటూ కొత్త సినిమాలను అప్‌లోడ్ చేస్తోంది. దాని మీద ఎందుకు చర్య తీసుకోవటం లేదు అన్నది ప్రస్తుతం కొందరు సినీ అభిమానులు అడుగుతున్న ప్రశ్న.