జెడ్డాలో సింహం.. ఇండోర్ చిరుత‌పులి.. గుండెలు గుభేల్.. - MicTv.in - Telugu News
mictv telugu

జెడ్డాలో సింహం.. ఇండోర్ చిరుత‌పులి.. గుండెలు గుభేల్..

March 10, 2018

ఎంత మచ్చిక చేసుకున్నా క్రూరమృగ స్వభావం కోరలు చాచటమే, పంజా విసరటమే. ఆ నిజాన్ని కొందరు తెలుసుకోలేక వాటితో సరసాలాడాలని, వాటితో సెల్ఫీలు దిగాలని చూసి అనవసరంగా ప్రాణాల మీదకు తెచ్చుకుంటుంటారు. అచ్చు అలాంటి ఘటనే  సౌదీ అరేబియాలోని జెడ్డాలో జరిగింది. అక్కడ స్ప్రింగ్ ఫెస్టివల్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఓ మచ్చిక చేసుకున్న సింహాన్ని బోనులోకి పంపి, పదేళ్ల వయసున్న పిల్లలను దాంతో ఆడుకునే అవకాశాన్ని ఇచ్చారు. పోలోమంటూ పిల్లలు దానితో ఆటలకు ఎగబడ్డారు. ఆ బాలసింహం వయసు ఆరు నెలలే. కానీ బరువు 200 వందల కిలోలకుపైగా పెరిగింది.


బాలబాలికలతో బాలసింహం ఆడుకుంటుంది అనుకున్నాడు దాని కోచ్. కానీ అది ఒక్కసారిగా  ఓ పాపను పట్టుకుంది. పాపను కిందపారేసి నోట్లోకి తీసుకోబోయింది. ఇంతలో దాని కోచ్ అప్రమత్తమయ్యాడు. వెంటనే దాన్నుండి పాపను రక్షించే ప్రయత్నం చేశాడు. కొంత సేపయ్యాక అది పాపను వదిలింది. పిల్లలంతా జడుసుకొని సింహంతో ఆటా వద్దు, పాటా వద్దని తోక ముడిచారు.  అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అది మీరూ చూడొచ్చు.

ఇండోర్‌లో జనంపై పంజా విసరిన చిరుత పులి

మరో ఘటనలో జనావాసాల్లోకి చిరుతపులి వచ్చి తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటన మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరిగింది.  ఇండోర్‌లోని పలహార్‌ నగర్‌లో నిర్మాణంలో ఉన్న ఓ భవంతిలోకి చిరుతపులి వచ్చింది. దీన్ని గమనించిన కాలనీవాసులు అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చారు. అటవీశాఖ అధికారులు దాన్ని ప్రాణాలతో పట్టుకోవాలని శ్రమించారు. ఈ క్రమంలో పులి వీధుల వెంబడి పరుగెడుతూ ముగ్గురిని గాయపరిచింది.

నానా రభస సృష్టించింది. కాలనీవాసులకు, అటవీ అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. ఎట్టకేలకు మత్తు ఇంజెక్షన్ల సాయంతో దాన్ని సజీవంగా పట్టుకున్నారు. అడవుల్ని నరికేయటంతోనే వన్యమృగాలు ఇలా జనావాసాల్లోకి చొరబడుతున్నాయని అటవీశాఖ అధికారులు అంటున్నారు.