న్యూజిలాండ్‌లో చావు, బ్రతుకుల మధ్య నిజామాబాద్ బిడ్డ...ప్రభుత్వం ఆదుకోవాలి! - MicTv.in - Telugu News
mictv telugu

న్యూజిలాండ్‌లో చావు, బ్రతుకుల మధ్య నిజామాబాద్ బిడ్డ…ప్రభుత్వం ఆదుకోవాలి!

February 26, 2018

దేశం కాని దేశంలో ఓ ప్రాణం..చావు బ్రతుకుల నడుమ కొట్టుమిట్టాడుతోంది. అందరూ ఉన్నా కూడా అనాథలా ఒంటరిగా ఆసుపత్రి బెడ్‌పై జీవత్సవంలా పడి ఉంది. పరాయిదేశంలో బిడ్డ ప్రమాదంలో ఉన్నాడని తెలిసినా కూడా ఆ తల్లిదండ్రులు… కన్నీళ్లు ఇంకిపోయేలా ఏడవడం తప్ప, కళ్ల నిండుగా కన్నబిడ్డను  చూసుకోలేని పరిస్థితి. ఎందుకంటే వాళ్లు ఉండేది ఎక్కడో నిజామాబాద్‌ జిల్లాలో ఉన్న గంగరమంద అనే చిన్న గ్రామంలో. కోమాలో ఉన్న బిడ్డ దగ్గరికి ఎలా వెళ్లాలో తెలియని పరిస్థితి. అయినా అతికష్టం మీద పాస్‌పోర్ట్ తీసుకున్నారు.

కానీ వీసా రాని పరిస్థితి. ఇక్కడ అందరం ఉండి కూడా.. బిడ్డ పరాయిదేశంలో ఒంటరిగా చావుతో పోరాడుతున్నాడని  తెలిసిన ఆ కన్నపేగు ఎంత మనోవేదన అనుభవిస్తుందో పాపం. ప్రభుత్వం సాయం చేసి మమ్ములను.. మాబిడ్డ దగ్గరికి చేర్చాలని ఆ తల్లిదండ్రులు వేడుకుంటున్నారు.

వ్యవసాయ కుటుంబంలో పుట్టిన హరీష్ గోపాల్ ఎంతో కష్టపడి.. పై చదువులకోసం 3 సంవత్సరాల క్రితం న్యూజీలాండ్‌కి వెళ్లాడు. కష్టపడి చదివి మంచి ఉద్యోగం సంపాదించి తల్లిదండ్రులను బాగా చూసుకోవాలనుకున్నాడు. అనుకున్నట్టుగానే మూడు సంవత్సరాలు కష్టపడి చదువును పూర్తి చేశాడు. ఫిబ్రవరి 17నాడు వర్కింగ్ వీసాకోసం బైక్‌పై వెళుతుండగా తోఫా దగ్గర  రాంగ్ రూట్‌లో వచ్చిన ఓ కారు  అతని ఆశలను..కన్న కలలను చిదిమేసింది.

 ప్రస్తుతం అతను న్యూజీలాండ్‌లోని ఓ ఆసుపత్రిలో కోమాలో ఉన్నాడు. 10 రోజులుగా అతనికి అక్కడి ప్రభుత్వం ట్రీట్‌మెంట్ చేయిస్తూనే ఉంది. కానీ కన్న తల్లిదండ్రులు 10 రోజులుగా వీసా రాక… చెప్పులరిగేలా తిరుగుతూనే ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వం చొరవ తీసుకుని  ఆ తల్లిదండ్రుల మనోవేదనను అర్థం చేసుకుని హరీష్ గోపాల్‌ను  ఆదుకోవాలని  కోరుకుంటున్నాం.