ప్లీజ్ నన్ను కాపాడండి.. సౌదీలో చిక్కుకున్నమహిళ వీడియో ఆర్తనాదం


ఒక మహిళ తీవ్రమైన కష్టాల్లో చిక్కుకున్నట్టున్న వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఆమె సౌదీ అరేబియాలో చిక్కుకున్నానని వీడియోలో ఏడుస్తూ చాలా ధీనంగా తన బాధను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆమె మాట్లాడుతున్న తీరును బట్టి పంజాబీ యువతి అని క్లియర్‌గా తెలుస్తోంది. తను గతేడాది సౌదీ అరేబియాలోని ద్వాదమి అనే నగరంలో వున్నట్టు చెప్పింది. తనకు పంజాబ్‌లో భగవంత్ మాన్ సహాబ్ అనే పెద్దమనిషి బాగా పరిచయమున్నట్టున్నాడు. పదేపదే అతని పేరును తలుచుకుంటూ ప్లీజ్ నన్ను ఆదుకోండి అంటూ శోకిస్తూ వేడుకొంటోంది.‘‘ నాకిద్దరు పిల్లలున్నారు, అమ్మకి ఆపరేషన్ చెయ్యాలి. అందుకోసం డబ్బుల సంపాదించుకుందామని ఇక్కడికొచ్చాను. కానీ ఇక్కడ నన్ను వచ్చినప్పటినుండి తీవ్రమైన చిత్రహింసలకు గురి చేస్తున్నారు అరబ్బులు.

నన్ను ఒక గదిలో బంధించారు. కడుపుకు సరిగ్గా తిండి కూడా పెట్టకుండా ఇష్టమొచ్చినట్టుగా కొడుతున్నారు, తిడుతున్నారు. నాకు వెంటనే ఈ నరక కూపంలోంచి బయలకు రావాలని వుంది. కానీ నాకిక్కడ ఎవరూ లేరు. ఇక్కడి పోలీస్ స్టేషన్‌కు వెళ్ళి కంప్లైంటిచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. వాళ్ళు రివర్స్‌లో నన్ను దుర్భాషలాడుతూ, కొట్టి లాక్కొచ్చి మా ఓనర్‌కు అప్పజెప్పారు. నాకు నా భారతదేశం వచ్చేసి నా ఫ్యామిలీతో కలో, గంజో తింటూ అక్కడే వుండాలని వుంది. దయచేసి ఎవరైనా నా ఈ వీడియో చూసి నా బాధను అర్థం చేస్కొని నన్ను ఈ ఊబిలోంచి బయలకు తియ్యాలని వేడుకుంటున్నాను. ఇక్కడ మనుషులు కాదు రాక్షసులు వుంటారు. ఇక్కడికి ఎవరూ రాకండి. వస్తే కష్టాలు తప్పవు… ’’ అంటూ ఆ మహిళ కడు ధీనంగా వేడుకుంటోంది. కానీ వీడియోలో ఎక్కడా తను పేరును గానీ, పంజాబ్‌లో తనది ఏ వూరో కూడా చెప్పలేదు. విదేశంగ మంత్రి సుష్మాస్వరాజ్ వెంటనే స్పందించి ఆ మహిళను భారతదేశానికి రప్పించాలని నెటిజనులు కోరుకుంటున్నారు. అప్పట్లో పాకిస్తాన్‌లో వున్న గీతను ఇండియాకు రప్పించడంలో సుష్మా స్వరాజే కీలకంగా వ్యవహరించారు. ఈమె విషయంలో కూడా ఆ దేవతే వెంటనే స్పందించాలని కోరుకుంటున్నారు.

SHARE