మేమూ అందరిలాగే...మాకు సపోర్ట్ చేయండి ! - MicTv.in - Telugu News
mictv telugu

మేమూ అందరిలాగే…మాకు సపోర్ట్ చేయండి !

February 22, 2018

వాళ్లలో కొందరు రాత్రి అయితే చాలు  పెదాలకు లిప్ స్టిక్ పూసుకుని, తలలో పూలు పెట్టుకుని  వ్యభిచారం చేస్తుంటారు. మరికొందరు చప్పట్లు కొట్టుకుంటూ బస్టాండ్లలో,రైళ్లలో డబ్బులు అడుక్కుంటారు. చాలామందికి వారి గురించి తెలిసినవి ఇవే. వారిని చూస్తే చాలు చీచీ అని చీదరించుకుంటాం. కానీ వాళ్లు అలా ఎందుకు తయారయ్యారో? ఎందుకు అలా ప్రవర్తిస్తున్నారో? అని ఒక్కసారి కూడా ఆలోచించం. వీళ్ల విషయంలో నాణేనికి ఒక వైపే చూసిన మనం, రెండో వైపు కూడా చూస్తే  వాళ్ల మనోగతం ఏంటో అర్థమవుతుంది. వాళ్లలో కొందరు తప్పుడు దారిలో వెళుతున్నారు కరక్టే. వారిలో  కొందరు నిజాయితీతో బ్రతుకుదామన్నా ఈ సమాజం వాళ్లను ప్రశాంతంగా ఉండనివ్వదు అదే వారి బాధ.
ప్రభుత్వం, సమాజం  మమ్మల్ని చిన్న చూపు చూసి దూరం పెడుతోందని  వాళ్ల బాధ, మా మనోభావాలు అర్థం చేసుకోకుండా మాపై హింస,వివక్ష చూపుతున్నారనే వాళ్ల బాధ, అర్థం చేసుకోవాల్సిన  కన్న తల్లిదండ్రులే  సొసైటీకి భయపడి మమ్మల్ని చీదరించుకుంటున్నారనే వాళ్ల బాధ. మా పుట్టుక,శరీర ధర్మాన్ని దేవుడే సృష్టించాడు అంతేకాని మేం కావాలని కల్పించుకోలేదు అనే వాళ్ల బాధ. ఎక్కడా ఉద్యోగం దొరక్క  తప్పనిసరి  పరిస్థితుల్లో వ్యభిచారం, భిక్షాటన చేస్తున్నామనే వాళ్ల బాధ…సమాజంలో ఇన్ని బాధలు అనుభవిస్తున్న వాళ్లకు సపోర్ట్ చేయాల్సిన బాధ్యత మనందరిపై ఉంది. ప్రత్యేక హక్కుల కోసం ఎల్జిబిటీలు చేస్తున్న పోరాటంకు మద్దతు తెలపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సమాజంలో వారికి సమాన హక్కులు కల్పించేలా ప్రభుత్వాలను నిలదీయాల్సి ఉంది. వాళ్లు కూడా మనలాగే మనుషులే అని గుర్తించాల్సి అవసరం ఎంతైనా ఉంది. వాళ్లను మనలో కలుపుకుందాం, ప్రేమకు,మమతకు,మానవత్వానికి  లింగ భేదం లేదని చాటి చెప్పుదాం.