ఫ్రెండ్లీ పోలిసింగ్ అంటే నోటికచ్చిన బూతులు తిట్టడమా ? లేక రక్తాలు కారేలా కొట్టడమా? రుబాబు సూపియ్యడమా? దమ్కీలు ఇయ్యడమా ? బహుశా మలక్ పేట్ పోలీసులకు తెలిసిన ఫ్రెండ్లీ పోలిసింగ్ ఇదేనేమో. వివరాల్లోకి వెళ్తే..
అరుణ్ కుమార్ కు చెందిన మోటార్ బైక్ ను మలక్ పేట్ పోలీసులు తీసుకెళ్లారు. వాహన నిబంధనలను ఉల్లంఘించారని దాన్ని పట్టుకెళ్లారు. బండిని తిరిగి తెచ్చుకోవడానికి అరుణ్ తన స్నేహితుడితో కలసి పోలీస్ స్టేషన్ కు వెళ్లాడు. బండి గురించి అడగ్గా ఎస్ఐ రంజిత్ కుమార్, కానిస్టేబుల్ రమేష్ రెచ్చిపోయారు. అరుణ్ ను బండబూతులు తిట్టి, లాఠీలతో, బూటు కాళ్లతో తన్నాడు. తాను ఎంబీఏ చేసి ఎస్సై పోస్టుకు ప్రిపేర్ అవుతున్నానని ఈ సందర్భంగా అరుణ్ చెప్పారు. దీనికి రంజిత్ స్పందిస్తూ.. ‘నీ మొహానికి ఎస్సై అవుతవారా’ అని ఎద్దేవా చేస్తూ.. ఎక్కోతక్కో మాట్లాడితే రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అని దమ్కీలిచ్చారు. ముందే లా అండ్ ఆర్డర్ కంట్రోల్ పెట్టే పోలీసులాయే ఎదురు తిరగితే అడ్డమైన కేసులు పెట్టి బొక్కలో వేస్తారు అని భయపడి బాధితులు మౌనంగా ఉన్నారు.
అయినా ఖాకీల కోపం చల్లారలేదు , ఆ తర్వాత CI గంగిరెడ్డి అరుణ్ కుమార్ ను కులం పేరుతో దూషిస్తూ లోపలికి తీసుకెళ్లి చావగొట్టాడు. పోలీసులు కొట్టిన దెబ్బలకు పాపం అరుణ్ ఉస్మానియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. అరుణ్ కుమార్ ను పరామర్శించిన బిజేపి నేత మాజీ mla ఇంద్రసేనా రెడ్డి తెలంగాణలో దళితులపై పోలీసులు దాడులు పెరిగాయని, అరుణ్ ను చిత్రహింసలు పెట్టిన పోలీసులను వెంటనే అరెస్ట్ చెయ్యాలని డిమాండ్ చేశారు. పోలీసులు ప్రవర్తించిన తీరును అరుణ్ ఫ్రెండ్ మొబైల్ రికార్డ్ చేశాడు.
అయినా ఇదేమి ఫ్రెండ్లీ పోలీసింగ్ సార్లు! కరక్టే వాళ్లు లైసెన్స్ లేకనో, పేపర్లు లేకనో బండి నడిపిన్రు గావచ్చు , మీరు బండిని పోలీస్ స్టేషన్కు తీస్కపోయిన్రు గావచ్చు. కానీ ఇలా స్టేషన్ కు వచ్చిన వారిని బూతులు తిట్టడం, కుల దూషణ చెయ్యడం, రక్తాలు వచ్చేటట్టు కొట్టడం ఏంది సార్లు. ఇదేనా మీకు తెలిసిన ఫ్రెండ్లీ పోలీసింగ్? గిదాన్ని ఫ్రెండ్లీ పోలిసింగ్ అనరు, రుబాబు, దమ్కీ పోలిసింగ్ అంటరు.