కేట్ శర్మ మీటూ ఫేక్.. రేప్, లిప్‌కిస్ తూచ్ - MicTv.in - Telugu News
mictv telugu

కేట్ శర్మ మీటూ ఫేక్.. రేప్, లిప్‌కిస్ తూచ్

December 7, 2018

తమపై జరిగిన లైంగిక వేధింపుల గురించి చాలామంది మహిళలు, అమ్మాయిలు ధైర్యంగా బయటకు వచ్చి మీటూలో భాగంగా బయటపెడుతున్నారు. ఈ క్రమంలో కొందరు మేక వన్నె పులల అసలు రూపాలు బహిర్గతం అవుతున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న ఆరోపణలు ఎంతవరకు నిజం అనేది చట్టం తేలుస్తుంది. కొందరు వాళ్ళకు అవకాశాలు ఇవ్వలేదనే అక్కసుతో తమ ప్రతిష్ఠను దిగజార్చటానికి ఇలాంటి పుకార్లు చేస్తున్నారని నిందితులు ఆరోపిస్తున్నారు. బాలీవుడ్ ప్రముఖ దర్శకుడు సుభాష్ ఘయ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడంటూ నటి, మోడల్ కేట్ శర్మ చేసిన ఆరోపణలు తప్పని పోలీసులు తేల్చేశారు.ఆమె కావాలనే సుభాష్ ఘయ్‌పై  నిందలు మోపిందని చెప్పారు.

తనను ఇంటికి పిలిచిన సుభాష్ ఘయ్ అక్కడ చాలామంది ఉండగానే మసాజ్ చేయమని అడిగారని శర్మ పేర్కొంది. తాను కాదనలేక రెండు మూడు నిమిషాలు చేసిన తర్వాత చేతులు కడుక్కునేందుకు బాత్రూంలోకి వెళ్లగా,  ఆయన తన వెనకాలే వచ్చారని ముంబైలోని వెర్సోవా పోలీసులకు ఫిర్యాదు చేసింది. తనతో ఒకరాత్రి గడిపితే సినిమా అవకాశాలు ఇప్పిస్తానని, లేకపోతే ఇండస్ట్రీలో ఉండలేవని చెప్పి తనపై అత్యాచారానికి ప్రయత్నించాడని.. సినిమా చర్చ పేరుతో తనను పడగ్గదిలోకి  తీసుకెళ్లాడని, మాట్లాడుతూ ఉండగానే ఒక్కసారిగా తనను దగ్గరకు తీసుకుని లిప్ కిస్ పెట్టబోయాడని తన ఫిర్యాదులో పేర్కొంది.

కేసు నమోదు చేసిన పోలీసులు తమదైన శైలిలో విచారణ చేపట్టారు. ఆమె చేసినవన్నీ నిరాధార ఆరోపణలు అని తమ విచారణలో తేలిందని పోలీసులు తెలిపారు. దీంతో ఆమె తన తల్లి ఆరోగ్యం బాగాలేదని కేసును వెనక్కి తీసుకున్నట్టు వెల్లడించారు. దీనిపై సుభాష్ ఘయ్ స్పందిస్తూ.. ‘నాపై లేనిపోని ఆరోపణలు చేసి నా ప్రతిష్ఠను బజారుకు ఈడ్చేందుకు ప్రయత్నించిన కేట్‌పై చట్టపరమైన చర్యలు తీసుకుంటాను’ అని ఆగ్రహం వ్యక్తం చేశారు.