ప్రదీప్ రిక్వెస్ట్.. కేటీఆర్ ఓకే.. - MicTv.in - Telugu News
mictv telugu

ప్రదీప్ రిక్వెస్ట్.. కేటీఆర్ ఓకే..

February 10, 2018

మందుకొట్టి కారు నడుపుతూ పట్టిబడి అప్రతిష్ట మూటగట్టుకున్న టీవీ యాంకర్ ప్రదీప్ మరోమారు వార్తల్లో నిలిచాడు. చర్లపల్లిలోని ఓ పాఠశాలలో టాయిలెట్లు లేవని గమినించాడు. ఆ సమస్యను ట్విట్టర్ ద్వారా మంత్రి కేటీఆర్ వరకు తీసుకువెళ్ళాడు. వెంటనే కేటీఆర్ స్పందించారు. మేడ్చల్ కలెక్టర్‌ను ఆదేశించారు. త్వరలోనే ఆ పాఠశాలలో టాయిలెట్ సమస్య తీరనున్నది. ఒక్క డ్రంక్ అండ్ డ్రైవ్‌లో ప్రదీప్ పట్టుబడ్డాడని అతని మంచితనాన్నెవరూ విస్మరించలేరని ఈ సంఘటన రుజువు చేస్తోంది.

వివరాల్లోకి వెళ్తే.. ‘ చర్లపల్లిలో 40 ఏళ్ల క్రితం ఈ పాఠశాలలో ఇప్పటివరకు టాయిలెట్‌ లేదు. ఆ స్కూల్‌లో 120 మంది అమ్మాయిలు, 100 మంది అబ్బాయిలు చదువుకుంటున్నారు. టాయిలెట్స్ లేని కారణంగా విద్యార్థులంతా భోజనం తర్వాత నీళ్ళు తాగలేకపోతున్నారు. కారణం టాయిలెట్ కోసం చాలా దూరం నడిచి వెళ్లాల్సి వస్తోందని. విద్యార్థులు కడుపు నిండా నీళ్ళు కూడా తాగకుండా తమ ఆరోగ్యాలను పాడు చేసుకుంటున్న దారణ పరిస్థితులు నెలకొన్నాయి ఈ పాఠశాలలో ’ అని తెలుపుతూ వీ కేర్‌ అనే ఎన్‌జీవో సంస్థ ట్వీట్‌ చేసింది.

వెంటనే ఈ పోస్ట్‌పై యాంకర్ ప్రదీప్ స్పందించాడు. ఈ పోస్ట్‌ను రాష్ట్ర మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్ చేస్తూ.. ‘ చర్లపల్లిలోని ఆ పాఠశాలకు తమ టీమ్‌ వెళ్లి పరిశీలించింది. బాలికలు టాయిలెట్‌కు వెళ్ళాలంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొని వుంది. ఈ సమస్యను ప్రభుత్వమే పరిష్కరించాలి ’ అని ట్విట్టర్‌లో కోరాడు.

సోషల్ మీడియాలో ఎప్పుడూ ఆక్టివ్‌గా వుంటూ, నిత్యం ప్రజా సమస్యలపై తక్షణంగా స్పందించే కేటీఆర్, ప్రదీప్ ట్వీట్‌కు స్పందించారు. వెంటనే సంబంధిత అధికారులను ఆదేశించారు. పని పూర్తయ్యాక ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయగలరని కోరారు. కేటీఆర్ ఆదేశాలపై స్పందించిన కలెక్టర్,  డీఈవో రేపు ఆ పాఠశాలకు వెళ్ళి టాయిలెట్లను పరిశీలిస్తారు. పాతవాటి స్థానంలో కొత్త టాయిలెట్లు నిర్మిస్తామని అధికారులు కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. తన ట్వీట్‌కు స్పందించి, పాఠశాల పరిస్తితులను చక్కదిద్దుతున్న కేటీఆర్‌కు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపాడు ప్రదీప్.