పరిటాల గుండు కొట్టించలేదు.. నేనే కొట్టించుకున్నా - MicTv.in - Telugu News
mictv telugu

పరిటాల గుండు కొట్టించలేదు.. నేనే కొట్టించుకున్నా

December 8, 2017

ఇన్ని రోజులూ చాలా మంది పవన్ కల్యాణ్‌కు దివంగత టీడీపీ నేత పరిటాల రవి గుండు గీయించాడని ప్రచారంలో ఉంది. పవన్ భూసరిహద్దు విషయంలో అతి చేయగా రవి ఆయనకు గుండు కొట్టించి, గుణపాఠం చెప్పాడని అంటారు.  అయితే అది వట్టి పుకారేనని పవన్ కల్యాణ్ స్పష్టం చేశాడు. అప్పట్లో తనకు పరిటాల రవి అంటే ఎవరో కూడా తెలియదని పేర్కొన్నాడు.

విజ‌య‌వాడ‌లో ఆయ‌న పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌మావేశంలో మాట్లాడుతూ.. ‘ నేను తమ్ముడు సినిమా షూటింగ్‌లో వుండగా చిన్నన్నయ్య నాగబాబు నాకు ఫోన్ చేసి ‘ నిన్ను పరిటాల రవి తీసుకుపోలేదు కదా ? నాకు టీడీపీ వారు ఫోన్ చేసి బెరిరించారు ’ అని చెప్పారు. అందుకు నేను.. అసలు పరిటాల రవి అంటే ఎవరని..  అడిగాను. అంతే జరిగింది. నేను మరో ఉద్దేశంతో గుండు గీయించుకున్నాను. దీని గురించి నేనంటే గిట్టనివాళ్లు పరిటాల రవి పవన్ కల్యాణ్‌కు గుండు గీయించారని రకరకాల కథనాలు రాశారు. టీడీపీ వారే ఇటువంటి పుకార్లు చేయించారు. టీడీపీ నుంచి ఇన్ని జ‌రిగిన‌ప్ప‌టికీ నేను వ్య‌క్తిగ‌తంగా తీసుకోలేదు. ఇవ‌న్నీ నేను మ‌న‌సులో పెట్టుకోలేదు.  అది పచ్చి అబద్ధం ’ అని పవన్ చెప్పుకొచ్చారు.

‘ రాష్ట్ర విభజన తరువాత కూడా ఇంకా కులమతాలతో కొట్టుకోవద్దు. అలా అయితే అభివృద్ధి జరగదు. కాపు, కమ్మ, బీసీ, దళితులు అంటూ పెట్టుకుంటే అభివృద్ధి జరగదు. ప్రపంచస్థాయి రాజధానిగా అమరావతి నిలబడాలంటే అందరూ ఐక్యతగా వుండాలి. లేదంటే ఇక్క‌డ అమ‌రావ‌తి రాజ‌ధాని పెట్ట‌డం చాలా ప్ర‌మాదం. విజ‌య‌వాడ‌లో ప్ర‌జ‌లు కులాల ఉచ్చులో ఇరుక్కుపోతున్నారు. వంగ‌వీటి రంగా చ‌నిపోయిన‌ప్పుడు ఉన్న‌ది కూడా బాబు ప్ర‌భుత్వ‌మే.  నిరాయుధుడిగా ఉన్న వాడిని చంప‌డం త‌ప్పు. క‌మ్మ కులాల మీద దాడి చేసినందుకు ఆ బాధ చాలా మందిలో ఉండిపోయింది ’ అన్నారు.

కులాల మ‌ధ్య ఐక్య‌త ఉండాల‌నుకున్న‌ప్పుడు జ‌గ‌న్‌కు స‌పోర్ట్ చేయొచ్చు క‌దా అని కొంద‌రు అనుకోవ‌చ్చు. జ‌గ‌న్‌పై అభియోగాలు లేకుంటే నాకు అంత‌గా ఇబ్బంది ఉండేది కాదు. కేసులున్న‌ప్పుడు ఆయ‌న‌కు స‌పోర్ట్ చేయొద్ద‌ని చేయ‌లేదని చెప్పారు.