ఆసుపత్రి సిబ్బంది మనసులు  డ్రైనేజీ కన్నా కంపు - MicTv.in - Telugu News
mictv telugu

ఆసుపత్రి సిబ్బంది మనసులు  డ్రైనేజీ కన్నా కంపు

December 16, 2017

ఇన్నాళ్లూ డ్రైనేజీలే కంపు కొడతాయని అనుకున్నాం, కానీ  కొందరు తమ మనసులు డ్రైనేజీ కన్నా కంపు అని నిరూపిస్తున్నారు. ఒడిశాలో ఓ గర్భిణీ మహిళకు నొప్పులు వస్తే..ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోకుండా చెవిటోని ముందు శంఖం ఊదినట్టే చేశారు.

చివరకు యూరిన్ కని వెళ్లిన ఆతల్లి డ్రైనేజీలోనే  ప్రసవించింది. ఒడిశాలోని జానిగూడకు చెందిన ఓ మహిళ భర్త జ్వరం కారణంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. భర్తను చూసేందుకు నిండు గర్భిణీ అయిన ఆ మహిళ ఆసుపత్రికి వచ్చింది. ఈక్రమంలోనే ఆమెకు నొప్పులు వచ్చాయి. దీనితో ఆ మహిళ వెంట వచ్చిన తల్లి వెంటనే గైనకాలజిస్ట్ వార్డుకు తీసుకెళ్లింది. సార్ నాబిడ్డకు నొప్పులు వచ్చాయి సార్ కొంచెం చూడండి అని ప్రాధేయపడింది.

కానీ ఆసుపత్రి వారు ఇంతకు  ముందు ఏ ఆసుపత్రిలో చూపెట్టుకున్నారో కాగితాలు తీసుకురమ్మని చెప్పారు. మేం దూరం నుంచి వచ్చాం, కాగితాలు ఇంట్లో ఉన్నాయి అని చెప్పినా ఆసుపత్రి సిబ్బంది పట్టించుకోలేదని ఆ మహిళ తల్లి ఆవేదన వ్యక్తం చేసింది. యూరిన్ కని వెళ్లిన నాబిడ్డ చివరకు డ్రైనేజీలోనే ప్రసవించింది. ఆతర్వాత ఆసుపత్రి సిబ్బంది వచ్చి లోపటికి తీసుకెళ్లారు అని ఆమె మీడియాతో చెప్పింది. అయితే డాక్టర్లు మాత్రం అసలు వారు గైనకాలజిస్ట్ వార్డుకు రాలేదని, యూరిన్‌కు వెళ్లితే అక్కడే ప్రసవించిందని,ఇందులో తమ తప్పేం లేదని అంటున్నారు. ప్రస్తుతం తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారని వైద్యులు తెలిపారు.