14వ కాన్పు, చావుబతుకుల్లో.. ఆమె  పిల్లల్ని కనే యంత్రమా?   - MicTv.in - Telugu News
mictv telugu

14వ కాన్పు, చావుబతుకుల్లో.. ఆమె  పిల్లల్ని కనే యంత్రమా?  

March 3, 2018

ఆడది గర్భసంచి కలిగుండడమే ఆమె పాలిట శాపమా? ఈ కథ వింటే  నిజమే అనిపిస్తుంది. కొందరు మగాళ్లు  ఆడదాన్ని  కేవలం పిల్లలు కనే యంత్రంలాగానే చూస్తారు. ఆ తల్లి పడే  పురిటి నొప్పుల బాధలు  వాళ్ల చెవికి అవుసరం లేదు. భార్య ఆరోగ్యం ఏమైనా పోయినా పర్వాలేదు. సంతానంకోసం  భార్యని చంపుకునే వెధవలు కూడా ఉన్నారు ఈ ప్రపంచంలో.

మధ్యప్రదేశ్‌లోని బేగంగంజ్ జిల్లాలోని ఓ కన్నతల్లి పాలిట ఆమె గర్భసంచే  శాపమైంది. ఒకరు కాదు ఇద్దరు కాదు  ఏకంగా 14 మంది సంతానాన్ని తన గర్భసంచిలో భద్రంగా దాచింది. 14 సార్లు  పురిటి నొప్పులు  సంతోషంగా ఆ నొప్పులను భరించి  కుటుంబ సభ్యుల కోరిక మేరకు పిల్లల్ని కంటూ పోయింది.  కానీ ఇప్పుడు ఆమె ఆరోగ్య పరిస్థితి క్షీణించడానికి  ఆ గర్భసంచే కారణమయ్యింది.

వీర్పూర్ కు చెందిన 35 ఏళ్ల  శారదా అనే మహిళకు 14 వ సారి గర్భం వచ్చింది ఆమెకు అంతకు ముందే  13 మంది పిల్లల్లో ఇద్దరు చనిపోవడంతో,  ఒకసారి గర్భస్రావం అయినందున  10 మంది పిల్లలు ఉన్నారు. 14వ సారి గర్భం దాల్చడంతో  కుటుంబసభ్యులు  ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు ఆమె గర్భసంచి  చాలా బలహీనంగా ఉందని, రక్తస్రావం అవుతున్నట్లు గుర్తించారు. ఆమె పరిస్థితి అత్యంత విషమంగా ఉండటంతో అప్రమత్తమైన డాక్టర్లు వెంటనే సర్జరీ చేసి బిడ్డను బయటకు తీశారు.  గర్భాశయంలో తీవ్ర రక్తస్రావం కారణంగా ఆమె ఆరోగ్యం క్షీణించింది. ఇన్ని సార్లు గర్భం దాల్చడమే ఆమె అనారోగ్యానికి కారణం అని డాక్టర్లు తేల్చి చెప్పారు.  ఆమె ఆరోగ్యం పరిస్థితిని మెరుగు పరచడం కోసం వైద్యులు ప్రయత్నాలు చేస్తున్నారు.
14 సార్లు గర్భం దాల్చిన  ఆ మాతృమూర్తి ప్రస్తుతం  ప్రాణాల కోసం పోరాడుతూనే ఉంది.

ఆడదాన్ని పిల్లలు కనే యంత్రంలా భావించే మనుష్యులలో ఈ వార్త చదివిన తర్వాతైనా  మార్పు రావాలని కోరుకుందాం.