మలయాళ నటి ప్రియా ప్రకాశ్ వారియర్ రాత్రికి రాత్రికే ఒక పాటతోనే స్టార్‌గా మారిన సంగతి తెలిసిందే. ముస్లింల సాంప్రదాయ పాటలో ఆమె హావభావాలు అసభ్యంగా ఉన్నాయంటూ కొందరు హైదరాబాద్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమెతో పాటుగా నిర్మాతపై చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు.
ఈ విషయంపై స్పందించిన ప్రియా ప్రకాశ మాట్లాడుతూ.. ‘ ఈ పాటను ఇంతమంది ఆదరిస్తారని నేను అస్సలు అనుకోలేదు. దేశవ్యాప్తంగా ఇంతమంది ఇష్టపడుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. నన్ను ఆదరిస్తున్నఅభిమానులందరికి నా ధన్యవాదాలు’ అని తెలిపింది. ఆ పాటలో కన్నుకొట్టి ముస్లింల మనోభావాలను కించపరిచారనే ఆరోపణలపై ప్రశ్నించగా ‘ఆ కేసు గురించి నాకు తెలియదు.
దర్శకుడు చెప్పిందే చేశాను. అందులో ఎలాంటి అసభ్యతా లేదు. సినిమా కథ ప్రకారం అలా తీశారు. బాయ్ ఫ్రెండ్‌కు కన్నుకొట్టం తప్పుకాదు. అదో రొమాంటిక్ సైగ.. దీన్ని అనవసరంగా వివాదం చేస్తున్నారు’ అని తెలిపింది. అది ముస్లిం సాంప్రదాయ గీతమని మాత్రం తెలుసని, దాన్ని అవమానించామని మేం భావించడం లేదని ప్రియ తెలిపింది.