ప్రియాంక డ్రెస్‌పై అసెంబ్లీలో రగడ..... - MicTv.in - Telugu News
mictv telugu

ప్రియాంక డ్రెస్‌పై అసెంబ్లీలో రగడ…..

February 21, 2018

బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రాను  అసోం బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగించాలని రాష్ట్ర ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అసెంబ్లీ  సమావేశాలు జరుగుతున్న సమయంలో  కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఈ అంశాన్ని లేవనెత్తారు. అస్సాం పర్యాటక శాఖ కాలెండర్‌లో గౌనులో ఉన్న ప్రియాంక ఫోటోను ముద్రించారు. అయితే ప్రియాంక అస్సాం సంప్రదాయ దుస్తుల్లో లేదని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో అభ్యంతరం వ్యక్తం చేశారు.

‘అసోం పర్యాటక రంగ క్యాలెండర్‌ ఫొటోషూట్‌ సమయంలో బ్రాండ్‌ అంబాసిడర్‌ సాంప్రదాయ దుస్తులు ధరిస్తే మంచిది. రాష్ట్రంలో పర్యాటక రంగం ఇంకా అభివృద్ధి చెందాల్సి ఉంది. ప్రియాంక చోప్రాను అంబాసిడర్‌గా నియమించినప్పటికీ పర్యాటకుల సంఖ్య పెద్దగా పెరగలేదు’’ అని అసోం ప్రతిపక్ష నేత సైకియా అన్నారు.

ఈ విషయంపై స్పందించిన  అస్సాం పర్యాటక మంత్రి హిమంత్‌ బిస్వా శర్మ  ప్రియాంకకు మద్దతు పలికారు. అసెంబ్లీ తర్వాత మీడియాతో మాట్లాడిన ఆయన ఎప్పుడూ సంప్రదాయ దుస్తుల్లోనే ఉండడమనేది సాధ్యం కాదని చెప్పారు. ‘మనం ఎక్కడికైనా వెళ్లినప్పుడు రాష్ట్ర సంప్రదాయ దుస్తులు ధోతి ధరించి వెళ్తున్నామా? ప్యాంటు, షర్టులు వేసుకునే వెళ్తాం. విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వారిని కూడా సంప్రదాయ దుస్తుల్లో వస్తేనే ఆహ్వానిస్తున్నామా?’ అని మంత్రి  కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు.