ప్రొఫెసర్‌ను పుచ్చకాయలతో ముంచెత్తిన విద్యార్థులు - MicTv.in - Telugu News
mictv telugu

ప్రొఫెసర్‌ను పుచ్చకాయలతో ముంచెత్తిన విద్యార్థులు

March 21, 2018

విద్యార్థులు తప్పుడు పనులు చేస్తే తగు పద్ధతిలో చెప్పి మందలించాల్సిన ప్రొఫెసరే తప్పుగా మాట్లాడి చిక్కుల్లో పడ్డాడు. ముస్లిం విద్యార్థినులు హిజబ్ (తలపై వేసుకొనే ముసుగు)ను సరిగ్గా ధరించడం లేదని, వారు ఉద్దేశపూర్వకంగా తమ ఛాతీ భాగాన్ని సగానికి కోసిన పుచ్చకాయలా ప్రదర్శిస్తున్నారంటూ  ప్రొఫెసర్ జౌహర్ మునవ్వీర్ చేసిన వ్యాఖ్యలు కేరళలో దుమారం రేపుతున్నాయి. ఓ మతపరమైన కార్యక్రమంలో ఈ వ్యాఖ్యలు చేశారు. కోజికోడ్‌లోని ఫరూక్ ట్రెయినింగ్ కాలేజీకి చెందిన ఆయన ఇలా మాట్లాడటంతో పలు విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి.

కొందరు విద్యార్థులు పుచ్చకాయలతో ఫరూక్ కాలేజీ వెలుపల నిరసన ప్రదర్శన చేపట్టాయి. ప్రొఫెసర్ వ్యాఖ్యలకు నిరసనగా ఇద్దరు మహిళలు తమ అర్ధనగ్న ఫొటోలను ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేశారు. అయితే ఫేస్‌బుక్ వారి అకౌంట్లను నిలిపివేయడం గమనార్హం. ప్రొఫెసర్‌ను పుచ్చకాయలతో ముంచెత్తుతామని ఓ విద్యార్థి నాయకుడు అన్నారు. ప్రొఫెసర్ ప్రసంగించిన దాంట్లోంచి కొంత భాగాన్నే కత్తిరించి చూపడం సరికాదని కాలేజీ ప్రిన్సిపల్ జవహార్ అంటున్నారు. ఇదిలావుండగా ప్రొఫెసర్ వ్యాఖ్యలను సమర్థిస్తున్న కొందరు విద్యార్థులు అనుకూలంగా కాలేజీలో ప్రదర్శన నిర్వహించడం గమనార్హం.