‘జీఎస్టీ’ని నేను తీయలేదు..షూటింగ్‌కి వెళ్లలేదు - MicTv.in - Telugu News
mictv telugu

‘జీఎస్టీ’ని నేను తీయలేదు..షూటింగ్‌కి వెళ్లలేదు

February 17, 2018

జీఎస్టీ (గాడ్ సెక్స్ అండ్ ట్రూత్) అనే పోర్న్ సినిమాను నేనే తీశాను ’ అని జబ్బలు చరుచుకొని చెప్పాడు దర్శకుడు రాంగోపాల్ వర్మ. అడ్డొచ్చిన మహిళా సంఘాల మీద దుమ్మెత్తిపోసిన వర్మ ఇప్పుడు ప్లేట్ ఫిరాయించాడు. జీఎస్టీ షార్ట్‌ఫిల్మ్ వ్యవహారం, మహిళలను కించపరిచారనే అభియోగం కింద రెండు కేసులు నమోదయ్యాయి.  తనపై నమోదైన రెండు కేసులపై వివరణ ఇచ్చేందుకు విచారణకు హాజరైన వర్మ.. విచారణ అనంతరం మీడియాతో మాట్లాడారు.

‘ జీఎస్టీ నేను తీయలేదు. ఈ సినిమా డైరెక్టర్‌ను నేను కాదు.  దీనికీ నాకు ఏ సంబంధమూ లేదు. అసలు ఆ సినిమా షూటింగ్‌లో నేను పాల్గొనలేదు. కేవలం కాన్సెప్ట్ మాత్రమే నాది. అమెరికన్ ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా తీసిందని, తాను ఎలాంటి రెమ్యూనరేషన్ తీసుకోలేదని, తనకు డబ్బులు ముట్టినట్లు ఆధారాలుంటే రుజువు చేయాలి ’ అని మీడియాకు సవాల్ విసిరారు వర్మ.

భారతీయ చట్టాలను తాను ఉల్లంఘించలేదని చెప్పిన వర్మ.. సామాజిక కార్యకర్త దేవిని కావాలని తాను దూషించలేదని, మాటా మాటా పెరిగి వివాదంగా మారిందని చెప్పుకొచ్చారు. వర్మకు సంబంధించిన కేసు సాధారణ కేసు కాదని ఆయనను విచారించిన సైబర్ క్రైమ్ డీసీపీ రఘువీర్ తెలిపారు. ఈ కేసును ఆషామాషీగా విచారించలేమని, టెక్నికల్‌గా చాలా ఆధారాలను సేకరించాల్సి ఉందని ఆయన అన్నారు.

ఒకవేళ వర్మ దోషిగా తేలితే, రెండేళ్ల నుంచి ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉందని తెలిపారు. కోర్టులో ప్రవేశపెట్టేందుకు అవసరమైన ఆధారాలను సేకరించిన తర్వాతే అరెస్ట్‌పై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. వర్మ సినిమాకు సంబంధించి చాలా లింక్స్ షేర్ చేశారు.. వాటినిబట్టి మా దర్యాప్తు కొనసాగుతుందని చెప్పారు.