డబ్బు ఎప్పుడిస్తావ్‌ అంటూ రేప్ యత్నం.. సైకో వీరంగం - MicTv.in - Telugu News
mictv telugu

డబ్బు ఎప్పుడిస్తావ్‌ అంటూ రేప్ యత్నం.. సైకో వీరంగం

March 3, 2018

నెల్లూరు జిల్లా  కోవూరులో ఓ సైకో ఒంటరిగా వున్న మహిళలను టార్గెట్ చేశాడు. కనిపించిన మహిళల మీద అత్యాచార యత్నానికి పాల్పడటమే కాదు, కత్తితో దాడి చేస్తున్నాడు.  ‘ నాకు డబ్బులు ఇవ్వాలి.. ఎప్పుడిస్తావ్‌ ’ అనే ఒకే ఒక్క మాట మాట్లాడి మహిళల పట్ల ప్రాణాపాయంగా మారాడు. పలువురు మహిళలను తీవ్రంగా గాయపరిచిన ఆ సైకో ఎక్కడివాడో.. ఎందుకిలా మహిళలను టార్గెట్ చేశాడో.. ప్రస్తుతం కోవూరు ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తోంది.పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని లైబ్రరీ సెంటర్‌ సమీపంలో శుక్ర వారం తెల్లవారుజామున టిఫిన్‌ సెంటర్‌ నడిపే అంకమ్మపై (70) ఆ సైకో అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ప్రతిఘటించిన ఆమెపై కత్తితో గాయపరిచి పరారయ్యాడు. ఆ పక్కనే బ్రాహ్మణవీధిలో ఒంటరిగా ఉంటున్న జలదంకి విజయమ్మ(50)పై కూడా అత్యాచారయత్నం చేశాడు. ఆమె కేకలు వేయటంతో అక్కడకు వచ్చిన రవి అనే యువకుణ్ణి గాయపరిచి పరారయ్యాడు.

ఆ తరువాత పాత ఆంధ్రాబ్యాంకు సమీపంలో ఉంటున్న సుభాషిణిని ( 25 ) తీవ్రంగా కొట్టి గాయపరిచాడు. అక్కడే వాకిట్లో ముగ్గు వేస్తున్న నాగమణి ( 30 ) చెంప పగులగొట్టి పారిపోయాడు. అంతటితో ఆగకుండా  పక్కనే ఓ ఇంట్లోకి చొరబడి రమణమ్మను (30) రోకలితో కొట్టి గాయపరిచాడు. కేవలం అర్ధ గంట సమయంలోనే ఇంతమంది మహిళలను గాయపరిచిన సైకో ఉదంతం కోవూరులో సంచలనం రేపింది. గాయపడిన జలదంకి విజయమ్మ, ఒంటేరు అంకమ్మలను నెల్లూరు నగరంలోని వైద్యశాలకు తరలించారు. సమాచారం అందుకున్న క్లూస్‌టీం అధికారులు పోలీసు జాగిలం సహాయంతో నిందితుడిని పట్టుకొనేందుకు ప్రయత్నిస్తున్నారు. నిందితుడి ఊహా చిత్రాన్ని కూడా విడుదల చేశారు.