పాము వచ్చిందని.. నిద్రపోతున్న సీఎంకు ఫోన్ - MicTv.in - Telugu News
mictv telugu

పాము వచ్చిందని.. నిద్రపోతున్న సీఎంకు ఫోన్

December 6, 2018

ప్రజాసేవకు అసలైన ఉదాహరణగా నిలిచారు పుదుచ్చేరి ముఖ్యమంత్రి నారాయణస్వామి. అర్ధరాత్రి ఇంట్లోకి పాము వచ్చిందని ఫోన్ చేసిన కుటుంబానికి తక్షణ సహాయం అందేలా చేశారు. అరియాంకుప్పవ వద్ద రాజా అనే వ్యాపారి కుటుంబం నివాసముంటుంది. రాజాకు భార్య విజయ పిల్లలు వసంత్, సంధ్య ఉన్నారు. మంగళవారం రాత్రి రాజా వ్యాపార పని నిమిత్తం బయటకు వెళ్లాడు. విజయ పిల్లలతో కలసి పడుకుంది. అర్ధరాత్రి సమయంలో శబ్ధం రావడంతో లేచి చూసింది. అయిదు అడుగుల పొడవున్న పాము ఇంట్లోకి రావడం చూసి భయంతో పిల్లలను లేపింది. విజయ, పిల్లలు స్థానికుల సాయం కోసం అరిచారు. వారుని పోలీసులకు ఫోన్‌చేసి సాయం చేయమని అడిగారు. పోలీసులు అటవీశాఖ అధికారులకు సమాచారం ఇవ్వమన్నారు. స్థానికులు అటవీశాఖ అధికారులకు కూడా ఫోన్‌ చేశారు. కానీ అటవీ అధికారులు స్పందించలేదు.Telugu News puducherry chief minister responds to citizen calls in mid nightదీనితో ఎక్కువ సమయం వరకు ఎదరుచూసినా ఎలాంటి ప్రయోజనం లేకపోయింది. పాము వారిని చూసి బుసలు కొడుతుండటంతో వసంత్‌ ఇంట్లో ఉన్న ప్రభుత్వ డైరీలోని నెంబరుకు ఫోన్‌ చేసి సాయం అడగాలని నిశ్చయించుకున్నాడు. డైరీలో ఉన్న ముఖ్యమంత్రి నారాయణస్వామి నెంబరు కనబడటంతో వెంటనే ఫోన్‌ చేశారు. నిద్రపోతున్న ముఖ్యమంత్రి ఫోన్‌ తీసి మాట్లాడారు. అప్పుడు వసంత్‌ ‘తన ఇంట్లోకి పాము వచ్చిందని భయంతో పోలీసులకు ఫోన్‌ చేస్తే అటవీశాఖ అధికారులకు తెలపమన్నారు… వాళ్లూ ఫోన్‌ తీయలేద’ని చెప్పాడు. అప్పుడు ముఖ్యమంత్రి మీరు భయపడవద్దు మనుషులను పంపుతానని చెప్పి… అటవీశాఖ అధికారులకు ఫోన్‌ చేశారు. వెంటనే ఇద్దరు అటవీశాఖ సిబ్బంది అక్కడికి వెళ్లి పామును పట్టుకున్నారు. దీంతో కుటుంబసభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ విషయంగా ముఖ్యమంత్రి బుధవారం ఉదయం వారికి ఫోన్‌చేసి విచారించారు. అక్కడున్న పుట్టలను తొలగించాలని సీఎంను కోరారు. స్థానిక ఎమ్మెల్యే అనంతరామన్‌కి ముఖ్యమంత్రి సమాచారం అందించి నేరుగా వెళ్లి పరిశీలించాలని ఆదేశించారు.