రాధికా ఎంతపని చేశావ్.. ఒక్కసారి మనసు చెప్పింది వినాల్సింది - MicTv.in - Telugu News
mictv telugu

రాధికా ఎంతపని చేశావ్.. ఒక్కసారి మనసు చెప్పింది వినాల్సింది

April 2, 2018

జీవితంలో ఎదగటానికి, మంచి స్థాయిలో ఒదగటానికి మెదడుతో ఆలోచించాలి. అడుగడుగునా లౌక్యంగా వ్యవహరించాలి అంటే మైండుతో ఆలోచించి అడుగులు వెయ్యవలసి వస్తుంది. కానీ జీవితంలో సంతోషంగా, ఉత్సాహంగా బతకాలంటే మనసుతో ఆలోచించాలి. ఎవరికైనా సంపూర్ణ జీవితాన్ని ఇచ్చేది మనసే. మనసు ఎప్పుడూ జీవితాన్ని ఆనందంగా వుంచాలనే చూస్తుంది. అందుకని మనసు చెప్పింది వినాలి. కానీ.. ప్రముఖ టీవీ యాంకర్ రాధికా రెడ్డి ఎందుకు మనసు మాట వినలేదు. ఆ క్షణంలో మెదడు చెప్పిందే రైటని ఎలా అనుకుంది ? ‘ నా చావుకు ఎవరూ కారణం కాదు. నా మెదడే నాకు శత్రువు ’ అని సూసైడ్ నోట్ రాసుకొని చనిపోయింది రాధికా రెడ్డి. ఎన్ని ఆందోళనలు, ఎన్ని ఒత్తిడులు వున్నా.. వాటిని దూరం చేసే తక్షణ మందు మనసే కదా.ఆ మనసు ఉల్లాసంగా, ఉత్సహంగా వుండాలంటే ఏం చెయ్యాలి ? మనవాళ్ళు అనుకునే కుటుంబ సభ్యులతో గడపాలి. స్నేహితులతో వుండాలి. మన సమస్యలు మనవే అనుకున్నంత కాలం మనకు మనం కాకుండా పోతాం. సమస్యను నలుగురి ముందు చెప్పుకుంటే అది తీరినా తీరకపోయినా ఒత్తిడి అయితే తగ్గుతుంది. జీవితమే ఒక యుద్ధం అయినప్పుడు డిప్రెషన్‌తో ఫైట్ చేయలేమా ? మనసుతో దాన్ని తన్ని తరిమేయటం పెద్ద విషయం కాదేమో. కానీ రాధికా ఎందుకిలా డిప్రెషన్ ముందు ఓడిపోయింది. భర్తతో విడాకులు అవటం ఓవైపు, కొడుకు మానసిక వికలాంగుడనే బాధ మరోవైపు తనను బాధకు గురి చేసి వుండొచ్చు కానీ.. దానికి ఆమె చావు ఎలా పరిష్కారం అవుతుంది ? చావటానికి చాలా గట్స్ కవాలి.. అంత గట్స్ చూపించిన తను అందులోంచి ఏ ఒక్క పర్సెంట్ గట్స్ ప్రాబ్లెమ్ పైన చూపించినా బహుశా రాధిక ఆత్మహత్య చేసుకునేది కాదేమో. ఎన్నో వార్తల విశ్లేషణలు చేసిన అనుభవం వుంది. తన జీవితంలోకి తొంగి చూసిన సమస్యలను ఎందుకు విశ్లేషించుకోలేకపోయింది ?

రాధిక తన ఒత్తిడిని తనవాళ్ళకు చెప్పుండాల్సింది. వాళ్లు సొల్యూషన్ ఇస్తారో ఇవ్వరో అది తర్వాత ముచ్చట కానీ తప్పకుండా ఆమెకు ఒత్తిడి అయితే తగ్గేది. మూసాపేట గూడ్స్ షెడ్ రోడ్డులోని శ్రీవిల్లా అపార్ట్ మెంట్లోని 204 ప్లాట్‌లో తన తండ్రి, చెల్లితో కలిసి నివాసముంటోంది. పదిహేనేళ్ల క్రితం అనిల్ కుమార్ రెడ్డితో వివాహమైంది. వీరికి పద్నాలుగేళ్ల కుమారుడు భానుతేజారెడ్డి ఉన్నాడు. కుమారుడు మానసిక వికలాంగుడు. ఆరు నెలల క్రితం భర్త నుంచి విడాకులు తీసుకుంది రాధిక. అప్పటి నుంచి రాధిక మానసికంగా కుంగిపోతున్నట్టు తెలుస్తోంది. రాత్రి ఆఫీస్‌లో విధులు ముగించుకుని ఇంటికొచ్చిన రాధిక నేరుగా టెర్రస్ పైకి చేరుకుని అక్కడి నుంచి కిందకు దూకి బలవన్మరణానికి పాల్పడింది. అపార్ట్‌మెంట్ ముందు వైపు పెద్ద శబ్దం రావడంతో వాచ్‌మెన్ ఖంగుతిని అందరినీ పిలిచాడు. పోలీసులకు సమాచారం ఇచ్చారు.

మంచి యాంకర్ రాధికా రెడ్డి :

ఆమె పని చేస్తున్న వి6 ఛానల్‌కి రాధికా రెడ్డి తన పనితనం బాగా నచ్చింది. మంచి యాంకర్‌గా అనతి కాలంలోనే మంచిపేరు సంపాదించుకుంది. ఆమె చేసిన చాలా కార్యక్రమాలు ఆమెకూ, ఛానల్‌కు మంచి పేరును తీసుకువచ్చాయి. న్యూస్ ప్రజెంటర్‌గానే కాకుండా పలు కార్యక్రమాలకు వ్యాఖ్యాతగా వ్యవహరించారు. గోదావరి కథలు, తెలంగాణ ఆణిముత్యాలు, బోనాలు, సమ్మక్క సారలమ్మ జాతర విశేషాలు, తెలంగాణ తీర్థం ముచ్చట్లు, పండుగ లైవ్ షోలు వంటి అనేక కార్యక్రమాల్లో ఆమె ఆకట్టుకుంది. రాధికా రెడ్డి యాంకర్ మాత్రమే కాదు సంఘసంస్కర్త కూడా. అలాగే ‘ పైడి జయరాజ్ ’ డాక్యుమెంటరీ కోసం చాలా శ్రమించింది.

అటు వృత్తిని, ఇటు ప్రవృత్తిని బ్యాలెన్స్ చేసుకుంటూ వెళుతున్న రాధిక ఇలా చేయటం చాలా మందిని బాధ పెడుతోంది. వ్యక్తిత్వంలో ఎంతో వున్నతంగా వ్యవహరించే ఆమె ఎందుకో మనసు చెప్పింది వినలేక దివికేగిపోయింది ???