రాహుల్‌ ఎన్నిక ఖాయం.. సాయంత్రం పట్టాభిషేకం - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్‌ ఎన్నిక ఖాయం.. సాయంత్రం పట్టాభిషేకం

December 4, 2017

రాహుల్‌ గాంధీ మినహా ఎవరూ కాంగ్రెస్‌ అధ్యక్ష పదవికి పోటీ పడే అవకాశం కనబడటం లేదు. దీంతో ఆయన ఎన్నిక లాంఛనప్రాయంగానే కనిపిస్తున్నది. ఈ సాయంత్రానికే రాహుల్‌ అధ్యక్ష ఎన్నిక ఖరారయ్యే అవకాశం కన్పిస్తోంది. 

పార్టీ అధ్యక్ష పదవికి రాహుల్‌ సోమ‌వారం నామినేషన్‌ వేశారు. పార్టీ ప్రధాన కార్యాలయంలో రిటర్నింగ్‌ అధికారి వద్ద రాహుల్‌ నామినేషన్‌ వేస్తున్న సమయంలో పార్టీ రాష్ట్ర శాఖల చీఫ్‌లు,  మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, పార్టీ సీనియర్‌ నేతలు షీలా దీక్షిత్‌, సిద్ధరామయ్య, అహ్మద్‌ పటేల్‌, సుశీల్‌ కుమార్‌ షిండే, జితిన్‌ ప్రసాద్, మోహ్సినా కిడ్వాయ్‌, తరుణ్‌ గొగోయ్‌, జ్యోతిరాదిత్య సింధియా త‌దిత‌రులు రాహుల్ వెంట వున్నారు.

అధ్యక్ష పదవికి నామినేషన్‌ గడువు నేటితో ముగియనుంది. ఆదివారం సాయంత్రం వరకూ ఎవరూ నామినేషన్లు వేయలేదని పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ ఛైర్మన్‌ ఎం. రామచంద్రన్‌ తెలిపారు. ఇంతవరకు పార్టీ ఉపాధ్యక్షుడిగా వున్న రాహుల్ గాంధీ అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయటంతో కాంగ్రెస్ వర్గాల్లో ఉత్సాహం నెలకొన్నది.

ఈ సందర్భంగా రాహుల్‌పై మన్మోహన్‌ సింగ్‌ ప్రశంసల జల్లు కురిపించారు. ‘ కాంగ్రెస్ పార్టీ యొక్క పేరు, ప్రఖ్యాతులను రాహుల్ తప్పకుండా నిలబెట్టి, ఘన వారసత్వాన్ని ముందుకు తీసుకు వెళతారని ’ అభిప్రాయ పడ్డారు. ‘ డార్టింగ్ ఆఫ్ కాంగ్రెస్ ’ గా అభివర్ణించటం విశేషం. కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్ ఎన్నో విజయాలను సొంతం చేసుకోవాలని పలువురు సీనియర్ నేతలు అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.