రాహుల్ చేతికి పగ్గాలు వచ్చేశాయి.. - MicTv.in - Telugu News
mictv telugu

రాహుల్ చేతికి పగ్గాలు వచ్చేశాయి..

December 11, 2017

కాంగ్రెస్‌లో  రాహుల్ శకం మొదలైంది. పార్టీ అధ్యక్ష పదవికి ఆయన ఎన్నికయ్యారు. నామినేషన్ గడువు సోమవారంతో ముగియడంతో.. నామినేషన్ వేసిన ఏకైన అభ్యర్థి  రాహుల్ ఎన్నిక ఏకగ్రీవమైనట్టు కేంద్ర ఎన్నికల అథారిటీ చైర్మన్  ఎం. రామచంద్రన్‌ ప్రకటించారు. డిసెంబర్‌ 16న రాహుల్‌ లాంఛనంగా  అధ్యక్ష బాధ్యతలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. రాహుల్ ఎన్నికతో పార్టీ శ్రేణుల్లో హర్షం నెలకొంది. ఢిల్లీలో కాంగ్రెస్‌ పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద పార్టీ టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. సోనియాగాంధీ, ఇతర సీనియర్‌ నేతల సమక్షంలో ఆ రోజున ఏకగ్రీవంగా ఎన్నికైన రాహుల్‌కు ధ్రువపత్రాన్ని అందించనున్నారు. 2013లో రాహుల్‌ ఏఐసీసీ ఉపాధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి,  2014 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీ ప్రచార బాధ్యతలను భుజాన వేసుకున్నారు. ఇప్పుడు పార్టీకే దిశానిర్దేశాలు చేసే స్థాయికి ఎదిగారు.

హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ ఎన్నికల ఫలితాలకు రెండు రోజులు ముందు డిసెంబర్ 16న రాహుల్ పార్టీ బాధ్యతలు తీసుకుంటారు. గాంధీ – నెహ్రూ కుటుంబం నుంచి అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న ఐదో వ్యక్తి రాహుల్‌ అవటం విశేషం. రాాహుల్ రాజకీయ జీవితం గురించి ప్రస్తావించుకుంటే.. 2004 లో రాజకీయాల్లోకి వచ్చారు రాహుల్. అప్పటి నుంచి వివిధ విభాగాల్లో పనిచేస్తూ ఇవాళ కాంగ్రెస్ అధిష్ఠానానికి ఎన్నికయ్యారు.  ఎన్‌ఎస్‌యూఐ, యువజన కాంగ్రెస్‌ సారథ్య బాధ్యతలు నిర్వర్తించారు. 2008లో ‘ రాహుల్ కాంగ్రెస్ ప్రధాని ’ అని కేంద్ర మాజీ మంత్రి, ఆ పార్టీ సీనియర్ నేత వీరప్ప మొయిలీ అన్నప్పటి నుంచి రాహుల్ అధ్యక్ష పదవిపై ఆసక్తి నెలకొన్నది.