7 వేల మంది కార్యవర్గంతో రజనీకాంత్ పార్టీ - MicTv.in - Telugu News
mictv telugu

7 వేల మంది కార్యవర్గంతో రజనీకాంత్ పార్టీ

April 7, 2018

తమిళ రాజకీయాల్లోకి రజినీ పార్టీ కూడా త్వరలో రాబోతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇందుకు సంబంధించి తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌ పకడ్బందీగా రాజకీయ పార్టీ ఏర్పాటును పూర్తి చేసినట్టు తెలుస్తోంది. గత డిసెంబర్‌లో రాజకీయ పార్టీ ఏర్పాటు చేస్తానని రజనీ ప్రకటించిన విషయం తెలిసిందే. తమిళనాడులో 32 జిల్లాల్లోని 234 నియోజకవర్గాల్లో రానున్న ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ప్రకటించారు కూడా. కమల్ హాసన్ పార్టీ పెట్టేసారు.. మరి రజనీ వంతు ఎప్పుడా అని ఆయన అభిమానులు ఎదురు చూస్తున్నారు. రజనీ పార్టీ ప్రకటన ఎప్పుడు చేస్తారా అని తమిళ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.పార్టీ సుదీర్ఘ కాలం ప్రజల్లో ఉండేలా చర్యలు చేపట్టారు. రజనీ మక్కల్‌ మండ్రం కార్యవర్గాన్ని ఏర్పాటు చేసి వివిధ రాజకీయ పార్టీల తీరుతెన్నులను లోతుగా అధ్యయనం చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో తమిళనాడు వ్యాప్తంగా 38 రజనీ మక్కల్‌ మండ్రం జిల్లా కార్యవర్గ యూనిట్లను ఏర్పాటు చేశారు. ఇందులో దశలవారీగా ఏడు వేల మంది కార్యవర్గ సభ్యుల నియామకం కూడా పూర్తి చేసినట్టు తెలుస్తోంది. నియామక పత్రాలు, గుర్తింపు కార్డులు అందజేసే ప్రక్రియ కూడా ప్రారంభమైనట్టు తెలుస్తోంది.