ఇట్లైతే హైద్రాబాద్ అబ్బాయిలకు పెండ్లి కాదు - MicTv.in - Telugu News
mictv telugu

ఇట్లైతే హైద్రాబాద్ అబ్బాయిలకు పెండ్లి కాదు

October 30, 2017

చూస్తుంటే ముందు ముందు హైద్రాబాద్‌లో పెండ్లికాని బ్రహ్మచారుల సంఖ్య పెరిగిపోయేటట్టే ఉంది. ఎందుకంటే హైద్రాబాద్ నగరంలో బాలికల సంఖ్య రోజు రోజుకు తగ్గుతుందని ప్రభుత్వ సర్వేలో తేలింది. ప్రతి వెయ్యి మంది బాలురకు, బాలికలు 931 మంది మాత్రమే ఉన్నట్టు తేలింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ఏడాది ఫిబ్రవరి–మార్చిలో చేపట్టిన సామాజిక, ఆర్థిక సర్వే ప్రకారం ఈ నిష్పత్తి 1000/931గా నమోదైంది.

అందుకే ‘బేటీ బచావో’పై విస్తృత ప్రచారం చేసేందుకు అధికార యంత్రాంగం ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ‘బేటీ బచావో బేటీ పడావో’ కార్యక్రమానికి హీరోయిన్ రకుల్‌ప్రీత్‌సింగ్‌ను తెలంగాణ ప్రభుత్వం బ్రాండ్‌ అంబాసిడర్‌గా రంగంలో దింపింది. బాలికల పట్ల చిన్నచూపు, లింగనిర్ధారణ పరీక్షలు, అమలుకాని పీసీపీఎన్‌డీటీ యాక్ట్, మగపిల్లవాడు పుడితే రెండో బిడ్డకి నో చెప్పడం వంటివి ప్రస్తుత పరిస్థితులకు ప్రధాన కారణాలుగా తెలుస్తోంది.

సిటీలో బాలికల సంఖ్య పెంచేందుకు జిల్లా శిశు సంక్షేమ శాఖ ప్రతేక్యక చర్యలు చేపట్టింది. ‘బేటీ బచావో– బేటీ పడావో’ కార్యక్రమానికి 18 మందితో టాస్క్‌పోర్స్‌ ఏర్పాటు చేసింది. వీరు ఆస్పత్రుల్లో అమ్మాయి పుడితే మిఠాయిలు పంచడం, అంగన్‌వాడి కేంద్రాల్లో ప్రతి మూడో శనివారం,ఆ నెలలో పుట్టిన ఆడపిల్లలకు పుట్టిన రోజు వేడుకలు చేస్తున్నారు. తల్లులతో కేట్‌ కట్‌ చేయించి  శుభాకాంక్షలు చెబుతున్నారు.

గర్భిణులకు సామూహిక సీమంతం సైతం చేస్తున్నారు. రాఖీ పండగ రోజు బేటీ బచావో–బేటీ పడాలో అంటూ అంగన్‌వాడీ పరిధిలోని ప్రముఖుల నుంచి గవర్నర్‌ వరకు రాఖీలు కట్టారు. తాజాగా రకుల్‌ను రంగంలో దింపారు. బాలికలను రక్షించుకోకపోతే సమాజ ఉనికికే ముప్పు వాటిల్లుతుందని నిపుణులు చెబుతున్నారు.