రాష్ట్రపతి భవన్‌లో ఇక ఉడికే పప్పులు తక్కువే - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రపతి భవన్‌లో ఇక ఉడికే పప్పులు తక్కువే

March 27, 2018

అత్త సొమ్ము అల్లుడి దానం.. అన్నట్లు ప్రజల గోళ్లూడగొట్టి వసూలు చేసే సొమ్మును నేతలు తమ ఆడంబరాలకు వాడుకోడం మన దేశంలో  మామూలే. గల్లీ లీడర్ల దగ్గర్నుంచి ఢిల్లీ పెద్దల వరకూ అదే బాపతు. ప్రచారం, ఆడంబరం, భారీ విందులు, బొకేలు, కాన్వాయ్‌లు. ఈ సంస్కృతిని మార్చే దిశగా రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అడుగులు వేస్తున్నారు. రాష్ట్రపతి భవన్‌లో ఆడంబరాలకు, దండగమారి ఖర్చులకు చెక్ పెడుతున్నారు.

రాష్ట్రపతి భవన్‌లో ప్రస్తుతం రోజూ అథితుల కోసం  ఐదారు రకాల అల్ఫాహారాలు తయారు చేస్తున్నారు. వీటిలో చాలా భాగం వృథా అవుతున్నాయని, ఇకపై నుంచి రెండు రకాలు చాలని కోవింద్ ఆదేశించారు. అలాగే రాష్ట్రపతి భవన్ అలంకరణకు వాడుతున్న పువ్వులను కూడా బాగా తగ్గించారు.  

విందులను కూడా పెద్దగా ఇవ్వడం లేదు. ఇచ్చినా తక్కువ మందినే ఆహ్వానిస్తున్నారు.  మతపరమైన పండుగలను నిర్వహించడం మానేయాలని ఆయన తన సిబ్బందిని ఆదేశించారు. అందుకే గత ఏడాది ప్రథమ పౌరుడి నివాసంలో  దీపావళిని నిర్వహించలేదు. రిపబ్లిక్ డే సందర్భంగా ఇచ్చే ఎట్ హోం విందుకు 2వేల మందిని పిలవడం ఆనవాయితీకాగా, కోవింద్ 700మందికి పరిమితం చేశారు. చివరకు తన బంధువులను కూడా పిలవలేదు.