‘అమ్మా.. ఇయాల్ల పూరీలు దేవి పెట్టవా. రొట్టెలు గూడ జెయ్యవా… తినబుద్ది అయితున్నది. శాన రోజులైంది రొట్టెలు, పూరీలు తినక’ అని పిల్లలు కన్నతల్లిని అడుగుతుంటే. ఆ తల్లి దిక్కులు చూస్తూ.. గుడిసెలో నూనెలేదు, పిండి లేదని ఇంకా దిగులు చెందుతోంది. ‘నా పిల్లలు అడిగింది రొట్టెలు, పూరీలే గదా. అవిగూడా చేసి పెట్టలేని నిస్సహాయత నాది. హే భగవంతుడా ఏంది మాకు ఈ పరీక్ష’ అనుకుని ఆ తల్లి కళ్ళల్లో నీళ్లు ఒత్తుకుంది. వాళ్ళు అడిగింది బిర్యానీ కాదుకదా అనుకుని ఈ గంజినీళ్లతో కడుపు నింపుకోండని చెప్పింది. కానీ తను ఏం చెయ్యలేదు. ఎందుకంటే వాళ్లను కటిక పేదరికం ఆవరించింది. ఇంట్లో దరిద్రం తిష్ట వేసింది?? పేదరికానికి పరీక్ష అన్నట్టు పిల్లలున్నారు. మధ్యప్రదేశ్లోని శివపురి జిల్లాలోని ఆదివాసి గిరిజనుల దీన పరిస్థితి ఇది. అక్కడ ఇలా ఒక ఇల్లే కాదు చాలా ఇళ్లల్లో రోజూ ఆకలి పోరాటం వుంటుంది. లేత వయసు పిల్లలు కూడా ఆకలికి అల్లాడుతున్నారక్కడ.
ఇలాంటి బీదా బిక్కి ప్రజల కోసమే కదా ప్రభుత్వం రేషన్ కార్డును ప్రవేశ పెట్టిందనే ప్రశ్న మెదలొచ్చు. రూపాయికి కిలో బియ్యం ఇస్తున్నారు, పప్పులు, నూనెలు, చింతపండు, సబ్బులు కూడా ఇస్తున్నారు. అవి తీసుకోవడం వారికి అంత భారం కాదే అనుకోవచ్చు. కానీ వారి దౌర్భాగ్య స్థితి రేషన్ కార్డులను కూడా తాకట్టు పెట్టేలా చేసింది. పిల్లలకు జ్వరాలొచ్చో, తమకేదైనా మాయదారి జబ్బు వచ్చినప్పుడు చేతిలో డబ్బులు లేక రేషన్ కార్డులను తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది వాళ్ళకు. ఒంటి మీద తులం మాసం బంగారం వుంటేనైనా దాన్ని తాకట్టు పెట్టి డబ్బులు తెచ్చుకోవచ్చు. కానీ వాళ్లకు బంగారం అంటే ఏంటో కూడా తెలియదు. కూడని పరిస్థితుల్లో వారికి రేషన్ కార్డే అండగా నిలుస్తోంది. ఊళ్లో ఓ పెద్దమనిషి దగ్గర కార్డు కుదువ పెట్టి అవసరానికి డబ్బులు తీసుకుంటున్నారు. చివరికి వాళ్లు ఆకలికి అల్లాడుతున్నారు. అయినా ఆ పెద్ద మనిషి ఎవరో గానీ వారి పేదరికాన్ని ఆసరాగా చేసుకుని రేషన్ బియ్యం దండుకుంటున్నాడని సోషల్ మీడియాలో ప్రశ్నలు వినబడుతున్నాయి.
దేశాన్ని, రాష్ట్రాలను అభివృద్ధి పథంలో పరుగులు పెట్టిస్తున్నామని నేతలు చంకలు గుద్దుకుంటున్నారు. కానీ ఇంకా దేశంలో పేదరికం రాజ్యమేలుతోంది. కటిక దరిద్రంలో ప్రజలు అల్లాడుతున్నారనే విషయాన్ని నేతలు పసిగట్టాలి. ఇలాంటి ఆదివాసీల జీవితాలను పట్టించుకోవాలని కోరుతున్నారు. Telugu news Ration Card Hostage for a few Rupees in Madhya Pradesh