రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్.. కూలి జనానికి ఊరట - MicTv.in - Telugu News
mictv telugu

రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్.. కూలి జనానికి ఊరట

February 23, 2018

పొట్టకూటి కోసం హైదరాబాద్‌లో  కూలీనాలీ చేసుకుంటున్న వారు రేషన్ కోసం నెలనెలా  ఊరెళ్ళాల్సిన పరిస్థితి. ఒక్క హైదరాబాదే కాదు రాష్ట్రంలోని పలు నగరాలు, పట్టణాల్లో ఇలాంటి వలస కూలీలు లక్షల్లో ఉన్నారు. రేషన్ కోసం ఊరికి వెళ్ళకపోతే సరుకులు పోయే పరిస్థితి. ఈ సమస్యకు  చెక్ పెట్టేందుకు ప్రభుత్వం యోచిస్తోంది.

రేషన్‌ సరుకులను కేటాయించిన షాపులో కాకుండా మరే రేషన్‌ దుకాణంలోనైనా తీసుకునే వెసులుబాటును (పోర్టబిలిటీని)  ప్రభుత్వం కల్పిస్తోంది. వచ్చే నెల 1వ తేదీ నుంచి ఈ విధానం  అమల్లోకి వస్తుందని పౌర సరఫరాల శాఖ కమిషనర్‌ సీవీ ఆనంద్‌ తెలిపారు. గురువారం ఆయన ఎలక్ట్రానిక్‌ పాయింట్‌ ఆఫ్‌ సేల్‌ (ఈ–పాస్‌) ప్రాజెక్టుపై హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడారు. మే 1వ  తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడైనా రేషన్‌ సరుకులు తీసుకునేలా పోర్టబులిటీని అమలు చేస్తామని చెప్పారు. ఉదాహరణకు ఆదిలాబాద్‌కు చెందిన వ్యక్తి హైదరాబాద్‌లోని ఏదైనా రేషన్‌ దుకాణంలో బియ్యం, ఇతర నిత్యావసరాలు తీసుకునే అవకాశం ఏర్పడుతుందని వెల్లడించారు. రాష్ట్రంలోని ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వలసలు వెళ్లే కూలీలు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకోవచ్చని తెలిపారు. రాష్టంలో ఇప్పటికీ 2లక్షల రేషణ్ కార్డుల దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయన్నారు.రాష్ట్రంలోని 17 వేల రేషన్‌ షాపుల్లో ఈ–పాస్‌ విధానాన్ని విజయవంతంగా అమలు చేస్తున్నామని సీవీ ఆనంద్‌ వెల్లడించారు. అర్హులైన లబ్ధిదారులకు రేషన్‌ సరుకులు అందజేయడంలో, మిగులు సరుకులను ప్రభుత్వానికి తిరిగి అప్పగించడంలో ఈ–పాస్‌ విధానం ఎంతో సహాయపడిందన్నారు. రేషన్‌ డీలర్లకు కమీషన్‌ పెంపు వ్యవహారం ముఖ్యమంత్రి పరిశీలనలో ఉందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 1,200 రేషన్‌ షాపులు ఖాళీగా ఉన్నాయని, వాటికి డీలర్ల ఎంపికపై ప్రభుత్వానికి ఫైలు పంపామని తెలిపారు.