పడి లేచిన కెరటం - MicTv.in - Telugu News
mictv telugu

పడి లేచిన కెరటం

October 31, 2017

యాసిడ్ దాడులు మహిళల కలలను ఛిద్రం చేస్తున్నాయి. ఎన్ని కఠిన నియమాలు ప్రవేశ పెట్టినా ఉన్మాదులు మారటం లేదు. లండన్‌లో విస్మయానికి గురి చేసిన ఈ ఘటన చాలా మందిని కలిచి వేసింది. ఒకమ్మాయి మోడలింగ్ రంగంలో తనకంటూ ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్న సందర్భం. అంతలోనే ఒక కాల యముడు ఆమె కలలను చిన్నాభిన్నం చేశాడు. మరి అతను ఆమెను ప్రేమిస్తున్నాడా అంటే అదీ లేదు. ఉత్త పుణ్యానికే రేషమ్ ఖాన్ మీద యాసిడ్ దాడికి పాల్పడ్డాడు ఆ అగంతకుడు.

21 జూన్ 2017 న రేషమ్ ఖాన్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఫ్రెండ్స్‌తో పార్టీ చేసుకుందామని కారులో వెళుతోంది. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో కారు ఆపారు. కారులో ఆమె కజిన్ ముఖ్తార్‌ కూడా వున్నాడు. అప్పుడే కారు దగ్గరికి ఒక అగంతకుడు వచ్చి కారు అద్దాల మీద బాదాడు.

కారు అద్దాలు దించి ఏంటని అడిగేలోపే అతను తన వెంట తెచ్చుకున్న యాసిడ్‌ను రేషమ్ ముఖం మీద చిమ్మి పారిపోయాడు. క్షణాల్లోనే రేషమ్ ముఖం, ఒళ్ళు కాలిపోయాయి. వెంటనే స్థానికుల సాయంతో ఆసుపత్రికి తరలించారు. సుమారు నాలుగు నెలల పాటు రేషమ్‌కు ఆసుపత్రిలో చికిత్స జరిగింది. ముఖం మీద చాలా ప్లాస్టిక్ సర్జరీలు జరిగాయి. సాంతం కోలుకున్నాక తన ఫోటోలను  సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ‘ఇట్స్‌ టైమ్‌ టు స్టాప్‌ హైడింగ్‌ ’ అని స్టేటస్ కూడా పెట్టింది. చాలా మంది నెటిజనులు ఆమెలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్నారు. యాసిడ్ దాడి తరువాత తన ముఖాన్ని అద్దంలో చూసుకోవడానికి చాలా భయపడేదట. ‘నా తప్పు లేకుండా ఈ దారుణం జరిగింది. మరి నేనెందుకు ప్రపంచానికి నా ముఖాన్ని చాటెయ్యాాాలి ’  అని అంది. పడి లేచిన కెరటంలా మళ్ళీ తనకు నచ్చిన రంగంలో విజయవంతంగా రాణిస్తానని ఆశాభావం వ్యక్తం చేస్తోంది.