చంద్రబాబుతో రేవంత్ భేటీ - MicTv.in - Telugu News
mictv telugu

చంద్రబాబుతో రేవంత్ భేటీ

October 27, 2017

రేవంత్ రెడ్డి కాంగ్రెస్‌లో చేరతాడని పుకార్లు చక్కర్లు కొట్టడం తెలిసిందే. టీడీపీ తెలంగాణ వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు ఎల్. రమణ సైతం రేవంత్‌పై చంద్రబాబుకు ఫిర్యాదు చేయడమూ విదితమే. ఈ గొడవల నేపథ్యలో రేవంత్ రెడ్డి ఎట్టకేలకు  అధినేత చంద్రబాబు నాయుడిని ఏకాంతంగా కలిశారు.

బాబు తొమ్మిది రోజుల విదేశీ పర్యటనలో వుండటం వల్ల రేవంత్ చంద్రబాబును కలవడానికి వేచి చూడవలసి వచ్చింది. బాబు శుక్రవారం  పర్యటన నుండి నేరుగా హైదరాబాదు రాగానే తెలంగాణ తెలుగుదేశం నేతలతో సమావేశమయ్యారు. లేక్‌వ్యూ అతిథి గృహంలో జరిగిన ఈ సమావేశానికి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్‌.రమణ, నామా నాగేశ్వరరావు, మోత్కుపల్లి నర్సింహులు, పెద్దిరెడ్డి, రేవూరి ప్రకాశ్‌ రెడ్డి, ఉమామాధవరెడ్డి, అరవింద్‌కుమార్‌ గౌడ్‌ తదితరులు హాజరయ్యారు. ఇదే సమావేశానికి రేవంత్‌రెడ్డి కూడా హాజరయ్యారు.

ఈ భేటీలో ప్రధానంగా రేవంత్‌రెడ్డి వ్యవహారంపైనే చర్చ జరిగినట్లు సమాచారం. అందరితో కాకుండా రేవంత్ చంద్రబాబును ఏకాంతంగా కలిసి మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీలో జరుగుతున్న పరిణామాలపై రేవంత్ అధ్యక్షుడితో చర్చించినట్టు సమాచారం. శనివారం మళ్ళీ చంద్రబాబును అమరావతిలో కలిసి సుదీర్ఘంగా చర్చించనున్నారు. రేవంత్‌తో పాటు తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఈ సమావేశానికి అమరావతి వెళ్ళనున్నారు.