మా హృదయాలు తెలుగుదేశంతోనే...కానీ.. - MicTv.in - Telugu News
mictv telugu

మా హృదయాలు తెలుగుదేశంతోనే…కానీ..

December 13, 2017

‘మా హృదయాలు ఇంకా తెలుగుదేశంతోనే  కానీ.. మారిన పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని పార్టీలు మారుతున్నాం’  ఇదే టీడీపీని వీడి ఇతర పార్టీల తీర్థం పుచ్చుకున్న నాయకులు చెబుతున్న మాటలు. మొన్నటి రేవంత్ రెడ్డి నుంచి మొదలు.. నేటి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి వరకు  ప్రతి ఒక్కరు ఇస్తున్న స్టేట్‌మెంట్ ఇదే.

మరి వీరి ప్రకటనలు  చూస్తే… వీటిని పాజిటివ్ పాలిటిక్స్ అనాలో లేక అసలు సిసలు రాజకీయం అనుకోవాలో ఎవరికీ అర్థంకాని పరిస్థితి.  టీడీపి నుండి కాంగ్రెస్, టీఆర్ఎస్, బీజేపీల తీర్థం పుచ్చుకుంటున్న నేతల సానుభూతి మాటలు వింటుంటే.. వీరికి పార్టీని వీడాలని లేకున్నా ఎందుకు వీడుతున్నారు? చంద్రబాబు నేతృత్వంలో ఇతర పార్టీలపై దుమ్మెత్తిపోసిన నేతలు..ఇప్పుడు అవే పార్టీల్లో చేరడానికి ఎందుకు సిద్ధపడుతున్నారు? ఏం ఆశించి పార్టీని మారుతున్నారు ? కేవలం తమ రాజకీయ భవిష్యుత్తు కోసమే పార్టీలు మారుతున్నారా? లేక  వారు చెబుతున్నట్టు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులను బట్టి మారుతున్నారా? లేక తెలుగుదేశం పార్టీలో నెలకొన్న అలజడులను బట్టి మారుతున్నారా? అనేది ఎవ్వరికి అంతు చిక్కని ప్రశ్నే.

తెలంగాణ రాష్ట్ర సాధన కోసం వేల మంది విద్యార్థులు తమ ప్రాణాలను సైతం బలిపెడుతుంటే.. అప్పుడు  కరగని టీడీపీ నాయకుల మనసులు ఇప్పుడు ఒక్కసారిగా ఎందుకు మారుతున్నాయి. తమను ఎన్నుకున్న ప్రజల ఆకాంక్షలకన్నా.. తెలంగాణ వ్యతిరేకి అయిన చంద్రబాబు ప్రయోజనాలే తమకు ముఖ్యమని  ఉద్యమం అప్పుడు అనుకున్న  టీడీపీ తెలంగాణ నేతలలో ఇప్పుడు ఎందుకు ఈ మార్పు? మా తెలంగాణకు సపోర్టు చేయండి, మా పోరగాళ్లు చచ్చిపోతున్నారు అని అప్పుడు తమ నేతను నిలదీయని ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు తమపై ఏ ఒత్తిడి లేకున్నా..నొప్పించక తానొప్పక అన్నట్టు పార్టీనుండి ఎందుకు బయటకు వస్తున్నారు?

తెలుగుదేశం పార్టీ రెండు కళ్ల సిద్ధాంతం అంటూ తెలంగాణను అడ్డుకుని ఎన్ని కుట్రలు చేసినా కూడా చంద్రబాబు వెంటే ఉన్న తెలంగాణ టీడీపీ నేతలు, ఇప్పుడు బాబును వీడి ఎందుకు వెళుతున్నారు? తెలంగాణలో టీడీపీ ఉనికి కోల్పోతుందనే భయంతోనే వలస బాట పడుతున్నారేమో అనే అనుమానం కలుగుతుంది. మీదికి సానుభూతి స్టేట్‌మెంట్లు ఇస్తున్నా కూడా ప్రతి ఒక్కరి మనసులో ఇంకా ఏదో మతలబు దాగుందని తెలియకనే తెలుస్తుంది.

దివంగత తెలుగుదేశం నేత, మాజీ హోం మంత్రి ఎలిమినేటి మాధవరెడ్డి  సతీమణి ఉమా మాధవ రెడ్డి కుటుంబానికి తెలుగుదేశం పార్టీతో దశాబ్దాల అనుబంధం ఉంది. ఆమె భర్త మాధవరెడ్డి ఎన్టీఆర్ ప్రభుత్వంలో హాంమంత్రిగా కూడా పనిచేశారు. ఆ తర్వాత ఆమె కూడా ఉమా మాధవరెడ్డి మంత్రిగా కూడా పనిచేశారు. గతంలో చాలాసార్లు ముఖ్యంగా 2014 ఎలక్షన్స్ అప్పుడు కూడా ఉమా మాధవరెడ్డికి పార్టీ మారాలంటూ పిలుపులు వచ్చినా కూడా మారలేదు. టీఆర్ఎస్ పై భువనగిరి నుంచి టీడీపీ తరపున పోటీ చేసి ఓడిపోయింది. మరి ఇప్పుడు కొడుకు సందీప్ రెడ్డితో సహా తాము టీడీపీకి రాజీనామా చేస్తున్నట్లు..చంద్రబాబుకు రాజీనామా లేఖను పంపించారు. ప్రస్తుత పరిస్థితుల్లో గత్యంతరం లేకే  తెలుగుదేశం పార్టీని వీడినట్టు తెలిపారు. తమ పరిస్థితి అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నామన్నారు. పార్టీలో, ప్రభుత్వంలో పదవులిచ్చి ఎంతో గౌరవించారు. దశాబ్ధాలుగా టీడీపీతో తమ కుటుంబానికి అనుబందం ఉందని ఆమె లేఖలో పేర్కొన్నారు. కొడుకు రాజకీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకునే ఉమా మాధవరెడ్డి  టీడీపీని వీడినట్లు తెలుస్తోంది.

ఉమా మాధవ్‌ రెడ్డి, ఆమె కొడుకు సందీప్‌రెడ్డితో పాటు తమ అనుచరులతో కలిసి ఈ నెల 14 (గురువారం)న తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌ తీర్థం పుచ్చుకోనున్నారు.

ఏది ఏమైనా మేడిపండు చూడు మేలిమై ఉండు పొట్టవిప్పీ చూడు పురుగులుండు అన్నట్టుగా నేటి రాజకీయాలు తయారయ్యాయి.  రాజకీయం యెక్క అంతిమ లక్ష్యం ఒక్కటే  ‘అధికారం’.  దానికోసం ఎన్ని పార్టీలైనా మారతారు? ఎన్ని సానుభూతి మాటలైనా మాట్లాడతారు? ఎన్ని ఊసరివెల్లి వేశాలైనా వేస్తారు. లేకపోతే వాళ్లు రాజకీయనాయకులు ఎలా అవుతారు?

AUMR Resign