రేవంత్ మీడియాతో చిట్‌చాట్... టార్గెట్ కేటీఆర్ - MicTv.in - Telugu News
mictv telugu

రేవంత్ మీడియాతో చిట్‌చాట్… టార్గెట్ కేటీఆర్

November 22, 2017

రేవంత్ చాలారోజుల తర్వాత మీడియా ముందుకు వచ్చాడు. మీడియాలో తనకు సన్నిహితంగా ఉన్నవారిని పిలిచి ఆఫ్ ద రికార్డ్ అంటూ చాలా విషయాలు బయట పెట్టారు. ప్రధానంగా కేటీఆర్‌ను టార్గెట్ చేస్తూ రేవంత్ ముచ్చటించారు. ఈ సందర్భంగా తెలంగాణలోని డ్రగ్స్ కల్చర్ గురించి  రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేశాడు.

‘ డ్రగ్స్ కేసులో తెలంగాణ ప్రభుత్వం బాగా హడావిడి చేసింది. తెలంగాణ ప్రభుత్వం డ్రగ్స్ మహమ్మారిపై విరుచుకుపడితే  మధ్య తరగతి ప్రజలు ఎంతో సంతోషించారు. కానీ ఆతర్వాత ఎక్కడి గొంగడి అక్కడే అన్నట్టు కేసులను నీరుగార్చారు. ఇదివరకు మాదాపూర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌లో పబ్‌లు ఫైవ్ స్టార్ హోటల్స్ లో మాత్రమే ఉండేవి.

కానీ ఇప్పుడు విచ్చల విడిగా ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి.  కేసీఆర్  కుటుంబానికి చెందినవారే డ్రగ్స్ ను సరఫరా చేస్తున్నారు. డ్రగ్స్ కేసులో ‘ఈవెంట్ నౌ’ అనే సంస్థకు కూడా సంబంధం ఉంది. తెలంగాణ వచ్చాక  కొత్తగా 59 పబ్స్ ఇక్కడకు వచ్చాయి. ఆతర్వాత డ్రగ్స్ దందా పెరిగింది.

సన్ బర్న్  పార్టీలంటేనే మాదక ద్రవ్యాలు, మహిళల మీద దాడులు జరుగుతాయి. అలాంటి పార్టీలను  అదుపుచేయలేకే  గోవా  ప్రభుత్వమే రద్దు చేసింది. కర్ణాటక, మహారాష్ట్ర కూడా అనుమతులు ఇచ్చి ఆ తర్వాత రద్దు చేసింది. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత  సన్‌బర్న్ పార్టీలకు క్రీడా మైదానాలు ఇస్తున్నారు,హైటెక్స్‌లో గచ్చిబౌలి స్టేడియంలలో అనుమతి ఇచ్చారు.

వీటికి టికెట్స్ అమ్మింది వేరెవరో కాదు స్వయాన కేటీఆర్ బామ్మర్ధి  ఈవెంట్స్ నౌ ఛైర్మన్ పాకాల రాజేంద్ర ప్రసాద్. అందుకే డ్రగ్స్ దందాలో  కేసీఆర్ కుటుంబం కూడా ఉంది కాబట్టే డ్రగ్స్ కేసు మూత పడింది.  కాంగ్రెస్ ,టీడీపీ హయంలో వచ్చిన సంస్థలు ఎప్పుడూ నైట్ లైఫ్ అడగలేదు. కేవలం కేసీఆర్ ప్రభుత్వం వచ్చినాక మాత్రమే ఇది జరుగుతోంది. మాదక ద్రవ్యాల్లో  ఎవరు లబ్ధిదారులో ఇప్పటికైనా ప్రజలు అర్ధం చేసుకోవాలి.  నవంబర్ 24 సాయంత్రం 5 గంటల నుండి గచ్చిబౌలి క్రీడా స్టేడియం లో సన్ బర్న్ పార్టీకి తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది.  

ఒక టికెట్ ధర 2499 నుంచి 3 లక్షల 84 వేల వరకు ఉన్నాయి. కోట్లలో వ్యాపారం జరుగుతోంది.  డ్రగ్స్‌కు పబ్‌లు, మ్యూజికల్ నైట్స్ అడ్డాగా మారుతున్నాయని విచారణలో తేలిన తర్వాత ఎందుకు ఇంకా కొనసాగుతున్నాయి, ఎవరి ఒత్తిడితో అనుమతులు లభించాయి, ఇదేనా విశ్వ నగరం అంటే. 15 సంవత్సరాల పిల్లలకు కూడా అనుమతి ఉందని పార్టీ నిర్వాహకులు ప్రకటించారు.

కొలువుల కొట్లాట కు అనుమతి ఇవ్వరు కానీ మాదక ద్రవ్యాల వినియోగించే పార్టీలకు అనుమతి ఇస్తారా? రాష్ట్ర ప్రభుత్వానికి చిత్త శుద్ధి ఉంటే  పాకాల రాజేంద్ర ప్రసాద్ తో పాటు అందరినీ విచారణ చెయ్యాలి’ అని రేవంత్  అన్నాడు.