రోబోల వల్ల దేశంలో 12 కోట్ల మంది నిరుద్యోగులు - MicTv.in - Telugu News
mictv telugu

రోబోల వల్ల దేశంలో 12 కోట్ల మంది నిరుద్యోగులు

November 30, 2017

రోబో ఒక అద్భుత ఆవిష్కరణ. కానీ అవే ఇప్పుడు మనుషులకు ఎసరు పెట్టడానికి సిద్ధమవుతున్నాయి. తన కన్ను తాను పొడుచుకున్న చందంగా తయారైంది రోబోలను తయారు చేస్తున్న మనుషుల తీరు. రోబోలు, ఆటోమేషన్ వల్ల కోట్లాది ఉద్యోగాలు కనుమరుగవనున్నాయని ప్రముఖ రీసెర్చ్ సంస్థ మెకిస్సే వెల్లడించింది. 2030 నాటికి మనదేశంలో 11 నుంచి 12 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందని అంచనా వేసింది. ఉద్యోగాలను కోల్పోయిన వారు కొత్త ఉద్యోగాలను వెతుక్కోవడం కూడా కష్టమవుతుందని… దీనికి తోడు విద్యను పూర్తి చేసుకున్నవారికి కూడా చాలా కష్టాలు ఎదురవుతాయని, జీతాలపై కూడా ప్రభావం చూపుతుందని తెలిపింది. ఎక్కువగా చైనా దేశం ఉద్యోగాలను కోల్పోతున్నదని తెలిపింది. దరిదాపు 20 కోట్ల మందికి పైగా ఉద్యోగాలను కోల్పోతారని తన నివేదికలో పేర్కొన్నది. జపాన్, భారత్, చైనా, అమెరికా, మెక్సికో దేశాలు రోబోలు, ఆటోమేషన్ వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోనున్నాయని తెలిపింది. అభివృద్ధి చెందిన దేశాలే కాక… వర్ధమాన దేశాలకు కూడా ఈ సెగ తగలనున్నది.

అమెరికాలో కూడా మూడింట ఒక వంతు మంది ఉద్యోగాలను కోల్పోతారని అంచనా వేసింది. నైపుణ్యత కలిగిన ఉద్యోగాలు, నిర్వహణా ఉద్యోగాలపై కూడా భారీ ప్రభావం పడనుందని తెలిపింది. ఆటోమేషన్ త్వరగా విస్తరిస్తోందని… దీని ప్రభావంతో మెషీన్ ఆపరేటర్లు, బ్యాక్ ఆఫీస్ ఉద్యోగులు, ఫాస్ట్ ఫుడ్ వర్కర్లు ఎక్కువగా నష్టపోతారని చెప్పింది.