రోహిత్ శర్మ రికార్డు.. 200 సిక్సులు…

భారత్-వెస్టిండీస్ మధ్య జరిగిన ఐదు వన్డేల సీరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ సిరీస్‌‌లో విజయంతో ఐదు వన్డే సిరీస్‌లను గెలుచుకున్న జట్టుగా  కోహ్లీ సేన రికార్డు సాధించింది. జట్టుగా గెలిచిన విజయాలతో పాటు ఆటగాళ్లు కూడా అనేక వ్యక్తిగత రికార్డులను బద్దలు చేశారు.

కెప్టెన్ విరాట్ కోహ్లీ పది వేల పరుగుల మైలురాయిని ఈ సిరీస్‌లోనే దాటేశాడు.  అలాగే ఈ సిరీస్‌లో మూడు సెంచరీల సహాయంతో 453 పరుగులు సాధించిన కోహ్లీ మ్యాన్ ఆఫ్ ది సిరీస్‌గా నిలిచాడు. మహేంద్ర సింగ్ ధోని 0.8 సెకండ్లలో స్టంప్ అవుట్ చేసి తన పేరిట ఉన్న 0.9 సెకండ్ల రికార్డుని తిరగరాశాడు. ఈరోజు కేరళలోని తిరువనంతపురంలో జరిగిన సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్‌లో కూడా అనేక రికార్డులు నమోదయ్యాయి.

భారత ఓపెనర్ రోహిత్ శర్మ వన్డే క్రికెట్ చరిత్రలోనే అరుదైన రికార్డు సాధించాడు. ఈరోజు జరిగిన చివరి వన్డేలో నాలుగు సిక్సర్లు బాదిన రోహిత్ వన్డేల్లో అత్యంత వేగంగా 200 సిక్సర్లు బాదిన క్రికెటర్‌గా రికార్డులకెక్కాడు.

రెండో సిక్సర్ కొట్టిన వెంటనే ఈ ఘనత అందుకున్నాడు రోహిత్.. ఆ తర్వాత మరో రెండు సిక్సర్లు కొట్టాడు. 31 ఏళ్ల రోహిత్ 187వ ఇన్నింగ్స్‌లో ఈ అరుదైన మైలురాయిని అందుకున్నాడు. పాక్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిదిని వెనక్కి నెట్టాడు రోహిత్ శర్మ. ఆఫ్రిది 195 ఇన్నింగ్స్‌లలో ఈ ఘనత సాధించగా, రోహిత్ 187 ఇన్నింగ్స్‌లలోనే ఆ రికార్డును సొంతం చేసుకున్నాడు. అంతేకాదు, ధోనీ తర్వాత ఆ రికార్డును అందుకున్న భారత ఆటగాడు రోహిత్ శర్మే.