వరంగల్ రైల్వేస్టేషన్‌లో రూ.14.34 లక్షల చోరీ…ప్రయాణికుణ్ణి కొట్టి... - MicTv.in - Telugu News
mictv telugu

వరంగల్ రైల్వేస్టేషన్‌లో రూ.14.34 లక్షల చోరీ…ప్రయాణికుణ్ణి కొట్టి…

October 7, 2018

దొంగలు ప్రయాణికులను టార్గెట్ చేసుకుని అందినకాడికి దోచుకుంటున్నారు. తాజాగా వరంగల్ రల్వే స్టేషన్‌లో రూ.14.34 లక్షల నగదు దోపిడీకి గురైంది. ఐదుగురి దుండగులు కలిసి ఈ దోపిడీకి పాల్పడ్డారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలులో చెన్నై వెళ్తున్నాడు సురేశ్ దాలియా అనే నగల వ్యాపారి గుమాస్తా బేతి యుగంధర్. సురేశ్ చెన్నై నుంచి బంగారు నగలు తెచ్చి వరంగల్‌లో వ్యాపారం చేస్తుంటాడు. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి తన వద్ద పనిచేసే గుమస్తా యుగంధర్‌కు రూ.14.34 లక్షలు నగదు ఇచ్చి చెన్నై వెళ్లి నగల తయారీదారులకు ఇచ్చి రమ్మని పంపాడు సురేశ్.

Rs 14.34 lakhs of a robbery at Warangal railway station …

డబ్బులు పట్టుకుని వరంగల్ రైల్వే స్టేషన్‌కు వెళ్ళాడు యుగంధర్. తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు రాగానే అందులో ఎక్కాడు. రైలు కదులుతోంది. ఇంతలో యుగంధర్ వద్దకు వచ్చిన ఓ వ్యక్తి సార్ రమ్మంటున్నాడని బలవంతంగా అతడిని కిందికి దించాడు. అప్పటికే అక్కడ కాపుగాసిన మరో నలుగురు వ్యక్తులు అతడిపై దాడిచేసి చేతిలోని సంచిని లాక్కుని పారిపోయారు. యుగంధర్ లబోదిబోమంటూ రైల్వే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. నిందితుల కోసం గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకుంటామని అంటున్నారు పోలీసులు.