‘ భారత్ మాతాకీ జై ’ అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మాహుతి - MicTv.in - Telugu News
mictv telugu

‘ భారత్ మాతాకీ జై ’ అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త ఆత్మాహుతి

April 10, 2018

‘ భారత్ మాతాకీ జై ’ అంటూ ఆర్ఎస్ఎస్ కార్యకర్త రఘువీర్‌ శరణ్‌ అగర్వాల్‌ (45) ఒంటికి నిప్పు అంటించుకుని ఆత్మహుతి చేసుకున్నాడు. కలకలం రేపుతున్న ఈ ఘటన  రాజస్థాన్‌లోని వైశాలీ నగర్‌లో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. చుట్టూ జనం వుండగా అతను ఈ ఘాతుకానికి ఒడిగట్టాడు.

ఎస్సీఎస్టీ అట్రాసిటీ చట్టాన్ని నీరుగారుస్తున్నారని, కులం, మతం ప్రాతిపదికన రిజర్వేషన్లపై నిరసనలతో గత కొన్ని రోజులుగా దేశంలో నెలకొన్న విపత్కర పరిస్థితుల పట్ల మనస్తాపంతో ఆత్మాహుతి చేసుకున్నాడని తెలుస్తోంది. తనను తాను కాల్చుకున్న అనంతరం దాదాపు 100 మీటర్ల దూరం ‘భారత్‌ మాతా కీ జై’ అంటూ శరణ్‌ పరుగెత్తాడు. దీంతో స్థానిక ప్రజలు భయాందోళనలకు గురయ్యారు.

అతని ఒంటిపై నీరు పోసి మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. కానీ అప్పటికే అతని శరీరం 80 శాతం వరకు కాలిపోయింది. వెంటనే బాధితుణ్ణి సవాయ్‌ మాన్‌సింగ్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఢిల్లీ​లోని ఎయిమ్స్‌కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శరణ్‌ మంగళవారం ఉదయం మరణించారు.

కులం, మతం ఆధారంగా రిజర్వేషన్లు, దళితులు చేపట్టిన భారత్ బంద్ హింసాత్మకంగా మారటం వల్ల.. ఏప్పిల్ 10న మరోమారు భారత్ బంద్ అంటున్న క్రమంలో అతను ఆత్మహుతి చేసుకున్నాడని ఆర్ఎస్ఎస్ ఒక ప్రకటనలో తెలిపింది. మెడికల్‌ షాప్‌ నిర్వహించే శరణ్‌ ఆత్మహుతి వెనుక అనేక అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆయన మృతి వెనుక ఆర్థిక, కుటుంబ పరమైన కారణాలు కూడా ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు.