ఉక్కు వంతెనలు.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఇక రయ్ రయ్... - MicTv.in - Telugu News
mictv telugu

ఉక్కు వంతెనలు.. ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఇక రయ్ రయ్…

December 9, 2017

ఎప్పుడు చూసినా వాహనాల రద్దీతో కిక్కిరిసి వుండే   హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌కు మహర్దశ రానున్నది. 20 మీటర్ల ఎత్తులో రెండు ఉక్కు వంతెనలు ఆ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని  అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఒకటి ఇందిరా పార్క్ నుంచి..  వీఎస్టీ కూడలి వరకు, రెండవది రాంనగర్ నుంచి బాగ్ లింగంపల్లి మధ్య నిర్మిస్తారు. రూ. 426 కోట్ల వ్యయంతో ఈ వంతెనల నిర్మాణాలకు జీహెచ్ఎంసీ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం వున్న మెట్రో వంతెనతో ఈ వంతెనలు జత అయితే ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ రూపు రేఖలే మారిపోతాయి.

ఇందిరా పార్క్ నుంచి ఉప్పల్ వెళ్ళాలనుకున్నవాళ్ళు, సికింద్రాబాద్ నుండి కోఠి, మహాత్మా గాంధీ వెళ్ళే బస్సులు, వివిధ వాహనాలు, చిక్కడపల్లి, విద్యానగర్, రామ్‌నగర్, ఓయూ మార్గాల్లోంచి వచ్చీ పోయే వాహనాలతో ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ప్రయిణికులు చాలా ఇబ్బందులు ఎదుర్కుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయా మార్గాల్లో పైవంతెనలు నిర్మించాలని జీహెచ్‌ఎంసీ నిర్ణయించింది.

ఇందిరా పార్కు – వీఎస్టీ కూడలి మధ్య  వంతెన పొడవు 2.6 కి.మీ., వెడల్పు 16.61 మీటర్లు. రెండువైపులా రాకపోకలు ఉంటాయి. ఇందిరా పార్కు కట్టమైసమ్మ దేవాలయం నుంచి వీఎస్టీకూడలి వద్దనున్న విద్యుత్తు సబ్‌స్టేషన్‌ మధ్య నిర్మాణం జరగనుంది. ఆర్టీసీ ఎక్స్‌రోడ్డు కూడలి వద్ద ఇప్పటికే మెట్రోరైలు వంతెన ఉండటంతో.. దానిపై, భూమికి 20మీటర్ల (65.6 అడుగులు) ఎత్తున నిర్మిస్తామని అధికారులు తెలిపారు. భూసేకరణ చాలా తక్కువగా ఉంటుందని, కేవలం 9006 చ.మీటర్ల స్థలం సరిపోతుందని వివరించారు.

ఇక రాంనగర్‌ – బాగ్‌లింగంపల్లి మధ్య నిర్మించే ఈ వంతెన పొడవు 0.84 కి.మీ., వెడల్పు 13.61 మీటర్లు. ఆర్టీసీక్రాస్‌రోడ్స్ నుంచి వీఎస్టీ కూడలి అవతలి వరకు వెళ్లే పైవంతెనపై ఈ నిర్మాణం జరగనుంది. ఈ కూడలిలో రెండు పై వంతెనలకు అప్‌, డౌన్‌ ర్యాంపులు నిర్మిస్తామని, 9070 చ.మీటర్ల భూసేకరణ అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రుభుత్వ అనుమతులు రావడమే  తరువాయి  పనులు చకచక  మొదలవుతాయి అంటున్నారు.