mictv telugu

మోదీ 15 లక్షలు వేస్తున్నారని భారీ క్యూ..

February 9, 2019

తాము గెలిస్తే ఒక్కొక్కరి ఖాతాలో రూ. 15 లక్షల డబ్బులు వేస్తామని గత లోక్‌భ ఎన్నికల్లో ప్రధాని మోదీ చేసిన వాగ్దానం చిచ్చు ఇంకా రగులుతూనే ఉంది. మోదీ ప్రభుత్వం ప్రతి ఒక్కరి ఖాతాలో రూ. 15 లక్షలు జమ చేస్తోందన్న ప్రచారంతో ఏకంగా ఊరు ఊరంతా పోస్టల్ బ్యాంకు ముందు క్యూ కట్టారు. ఒకరినొకరు తోసుకోవడంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారంటే పరిస్థితి ఎంతవరకు వచ్చిందో అర్థం చేసుకోవచ్చు.

బిహార్‌లోని మోతిహారీ జిల్లా కేంద్రంలో ఈ తతంగం జరిగింది. ఇటీవల ఏర్పాటు చేసిన పోస్టల్ పేమెంట్ బ్యాంకులో ఖాతా తెరిస్తే మోదీ డబ్బులు వేస్తారని కొందరు ప్రచారం చేయడంతో అందరూ నమ్మేశారు. చుట్టుపక్కల ఊళ్ల నుంచి పిల్లాజెల్లా, ముసలీముతకాతోపాటు అందరూ తరలి వచ్చి గంటల తరబడి క్యూకట్టారు. తిండీతిప్పలూ లేకుండా పడిగాపులు కాశారు. డబ్బుల్లేవు, గిబ్బుల్లేవు, అంతా అబద్ధం అని పోస్టల్ సిబ్బంది చెప్పినా జనం పట్టించుకోలేదు. ‘అవన్నీ మీకెందుకు? ముందు ఖాతా ఓపెన్ చెయ్యండి?’ అని సిబ్బందికి చెప్పారు. దీంతో వారు నాలుగు కౌంటర్లు ఏర్పాటు చేసి ఖాతాలు ఓపెన్ చేశారు. కానీ జనం తాకిడి ఎక్కువ కావడంతో చేతులెత్తేశారు. గొడవ మొదలు కావడంతో పోలీసుల వచ్చి వారిని చెదరగొట్టారు.