ఓక్కి తుపానులో శబరిమల విలవిల - MicTv.in - Telugu News
mictv telugu

ఓక్కి తుపానులో శబరిమల విలవిల

December 1, 2017

ఓక్కి తుపాను కేరళను అతలాకుతలం చేస్తున్నది. ముఖ్యంగా అయ్యప్ప దర్శనానికి వెళ్ళిన  వేలాది మంది అయ్యప్ప భక్తులు తుపానులో చిక్కుకున్నారు. తుపాను ప్రభావం శృతి మించడంతో భక్తులను అడవి మార్గం గుండా ప్రయాణించవద్దని ట్రావెన్‌కోర్ బోర్డు హెచ్చరికలు జారీ చేసింది.

ముఖ్యంగా ఎరుమేలి – పంబా, సథరం – పులిమేడు మార్గాలు అత్యంత ప్రమాదకరంగా ఉన్నాయని, ఆ మార్గాల్లో అస్సలు వెళ్ళకూడదని టీడీబీ పేర్కొంది. సన్నిధానం చుట్టూ ఎనిమిది కిలోమీటర్ల పరిధిలో పెనుగాలులు వీస్తున్నాయి.. ఎడతెరిపిలేని వర్షం కారణంగా పంబానది ఉధృతంగా ప్రవహిస్తోంది.. పంబా దగ్గరున్న త్రివేణి పార్కింగ్‌ ప్రాంతం మొత్తం వరద నీటిలో మునిగిపోయింది. అక్కడ పార్కింగ్‌లో ఉన్న వాహనాలు సైతం నీటిలో పూర్తిగా మునిగిపోయాయి.

కావున భక్తులెవరూ నదిలోకి స్నానాలకు వెళ్ళకూడదంటున్నారు అధికారులు. తుపాను ధాటికి పెద్దపెద్ద వృక్షాలు కూలిపోయాయి. అలాగే శబరిమల ప్రాంతంలోని నదులు, నీటి ప్రవాహాలకు, విద్యుత్‌ స్థంభాలకు, చెట్లకు భక్తులు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు అధికారులు. ప్రస్తుతం శబరిమలకు రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

భక్తులు ఓకి తుపాను తగ్గే వరకూ రక్షణ ప్రాంతంలో ఉండాలని..సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు భక్తులు యాత్ర సాగించరాదని చెబుతున్నారు. తుపాను దృష్ట్యా ఎరుమేలి – పంబా నడకదారిని నిషేధించారు.

సన్నిధానం, పంబాల్లో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక షెల్టర్లలోనే భక్తులు విశ్రాంతి తీసుకోవాలని టీడీబీ పేర్కొంది.