mictv telugu

సాలార్‌జంగ్ గడియారం సరే.. ఈ నెమలి గడియారాన్ని చూస్తే..

February 8, 2019

మన హైదరాబాద్ సాలార్‌జంగ్ మ్యూజియంలోని గంటల గడియారం సంగతి అందరికీ తెలిసిందే. గంటగంటకు ఓ భటుడు వచ్చి గంట వాయించిపోతాడు. ఆ సీన్ చూడ్డానికి జనం పెద్దసంఖ్యలో బిలబిలా వచ్చేస్తారు. టెక్నాలజీ అంతంతమాత్రంగానే ఉన్న ఆ రోజుల్లోనే ఇలాంటి చక్కని ఆటోమేషన్ గడియారాలు చేశారని మనం విస్తుబోతాం.

ఈ గడియారానికి మించిన గడియారాలు చాలానే ఉన్నాయి ప్రపంచంలో. వాటిలో పీకాక్ గడియారం గురించి చెప్పాలంటే మాటలు చాలవు. రష్యాలోని సెయింట్ పీటర్స్ బర్గ్ నగరంలోని హెర్మిటేజ్ మ్యూజియంలో ఉందీ ఖతర్నాక్ గంటల యంత్రం. 1770ల ప్రాంతంలో.. ఎవరూ ఊహించని టెక్నాలజీతో దీన్ని తయరు చేశారు. శ్రావ్యమైన సంగీతంతోపాటు, పక్షుల అందచందాలు, కోడికూత దీని ప్రత్యేకత. దీని సంగీతానికి, విన్యాసానికి ఫిదా కాని జనం వుండనే వుండరు.

మూడు పక్షులు..

బ్రిటిష్ ఆటోమేషన్ శాస్త్రవేత్త జేమ్స్ కాక్ దీన్ని తయారు చేశాడు. రష్యా రాణి కేథరిన్ దీన్ని సొంతం  చేసుకుంది. నెమలి గడియారం మూడు భాగాల సమాహారం. గంట ఆసన్నం కాగానే సంగీతం వస్తుంది. పంజరంలోని గుడ్లగూబ తల తిప్పిచూస్తుంది. మధ్యలోని నెమలి మెడ వయ్యారంగా తిప్పుతూ, బంగారం పింఛం విడుస్తుంది. క్లయిమాక్సులో పక్కనే ఉన్న కోడిపుంజు కొక్కరోకో అని కూస్తుంది. పగటికి, రాత్రికి, జీవితానికి, మరణానికి చిహ్నంగా ఈ పక్షులను, సంగీతాన్ని అనుసంధానించారని చెబుతారు. సంగీతం, టెక్నాలజీ, సౌందర్యం కలగలసిన ఈ కళాఖండం పనితీరును పై వీడియోలో చూడండి. Telugu news salarjung  museum clock Peacock Clock An over 200-year-old timepiece-automaton adorned with golden mechanical birds, which still sing to this day.