భర్తను చూస్తానని వచ్చి రాజకీయం 

తమిళనాడు దివంగత సీఎం జయలలిత నెచ్చెలి శశికళ మళ్లీ హల్ చల్ చేస్తున్నారు. ఆస్పత్రిలో ఉన్న భర్త నటరాజన్ ను చూడ్డానికి ఐదు రోజుల పెరోల్ పై బెంగళూరు జైలు నుంచి చెన్నైకి చేరుకున్న ఆమె రాజకీయ వ్యూహాల్లో మునిగిపోయారు. ఆమె సోదరి కొడుకు దిన‌క‌ర‌న్ ప్రకటించినట్లు యడపాటి పళనిస్వామి ప్ర‌భుత్వానికి వ్య‌తిరేకంగా ఓటు వేసే అన్నాడీఎంకేలోని స్లీప‌ర్ సెల్స్ ఇప్పుడు బ‌య‌ట‌ప‌డొచ్చని  భావిస్తున్నారు. మంత్రి సెల్లూర్‌ రాజు చేసిన వ్యాఖ్యలు వారి అభిప్రాయానికి మరింత బ‌లం చేకూరుస్తున్నాయి. తాను స్లీపర్‌ సెల్‌ కాదని సెల్లూర్ రాజ్ స్ప‌ష్టం చేయ‌డంతో ఈ వార్తల్లో నిజముంటుందనే అనుమానాలు బలపడుతున్నాయి. అవసరమైనప్పుడు తమకు అనుకూలంగా 60 మంది ఎమ్మెల్యేలు వస్తారని, వారంతా ముఖ్యమంత్రి వర్గంలోనే ఉన్నారని టీటీవీ దినకరన్ మాట‌లు నిజ‌మ‌య్యే సూచ‌న‌లు ఉన్నాయని అనుమానిస్తున్నారు.

వారు భావించిన‌ట్లుగానే శ‌శిక‌ళ జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అధికార పార్టీలోని ముఖ్యంగా శశికళ, టీటీవీ దినకరన్‌ వర్గంలో ఉత్సాహాం క‌నిపిస్తోంది. పెరోల్‌ నిబంధనలు ఆటంకంగా నిలిచినా, ఆమెతో భేటీకి కొందరు ప్రయత్నిస్తున్నారు. నివాసం, ఆసుప‌త్రి కేంద్రాలుగా శశిక‌ళ‌ రాజకీయ వ్య‌వ‌హారాలు కొన‌సాగిస్తున్న‌ట్లు సమాచారం. ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా వ్యవహరించాలన్న దానిపై తమ మద్దతుదారులకు శశికళ దిశానిర్దేశం చేస్తున్నారని ప్రచారం జోరుగా సాగుతోంది. మంగళవారంతో పెరోల్‌ గడువు ముగియనుండటంతో ఆలోపు తన ఆలోచనలకు తుది రూపం తీసుకురావాలని శశికళ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్న‌ారట.

SHARE