భారతీయులకు సౌదీ షాక్ - MicTv.in - Telugu News
mictv telugu

భారతీయులకు సౌదీ షాక్

February 6, 2018

ఏ ముహూర్తంలో ట్రంప్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడో గానీ అతని కఠిన నిర్ణయాలు ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలపై తీవ్ర పరిణామాలనే చూపిస్తున్నాయి. తాజాగా ట్రంప్ విధి విధానాలను సౌదీ అరేబియా కూడా అవలంబిచడానికి పూనుకున్నది. అమెరికన్లకే ముందు ఉద్యోగాలు.. తర్వాతే విదేశీయులకు అన్న ట్రంప్ నిర్ణయాన్ని సౌదీ కూడా అనుసరించనుంది.

తమ దేశ పౌరుల్లో నిరుద్యోగం తగ్గించి, తమ పౌరులకే ముందు  కంపెనీలు ఉద్యోగాలు కట్టబెట్టేలా ఒత్తిడి పెంచేందుకు 12 కీలక రంగాల్లో విదేశీయులు పని చేయడాన్ని సౌదీ నిరోధించింది.  ఈ రంగాల్లో విదేశీ ఉద్యోగులు పనిచేయడాన్ని కార్మిక, సామాజిక సంక్షేమ మంత్రిత్వ శాఖ దశలవారీగా నియంత్రిస్తుంది. ఈ కఠిన విధానాన్ని కార్మిక మంత్రి అలీ బిన్‌ నసీర్‌ అల్‌ ఘపీస్‌ ఆమోద ముద్ర వేశారని ప్రభాత్‌ ఖబర్‌ పత్రిక వెల్లడించింది.

ఈ పరిణామం సౌదీలో దశాబ్దాలుగా సేవలందిస్తున్న 1.2 కోట్ల మంది విదేశీయులపై పెను ప్రభావం చూపనుంది. సౌదీలో పని చేసి పొట్టపోసుకుంటున్న 30 లక్షల మందికి పైగా భారతీయులపైనా ఈ ఉత్తర్వులు ప్రభావం చూపనున్నాయి. ఈ దెబ్బతో చాలా మంది కళ్ళు కన్న కలల్లో ఎడారి దుమ్ము పడనున్నది. ఎంతో మంది భారతీయుల జీవితాల్లో ఈ నిర్ణయం కలకలం రేపనున్నది.

ఈ రంగాలు ఇవే

హోం..ఆఫీస్‌ ఫర్నీచర్‌ దుకాణాలు, రెడీమేడ్‌ క్లాత్‌ స్టోర్స్‌, కిచెన్‌ సామాగ్రి, కారు, మోటార్‌ బైక్‌ షోరూమ్‌ దుకాణాల్లో ఈ ఏడాది సెప్టెంబర్‌ నుంచి విదేశీ ఉద్యోగులు పని చేయడంపై నియంత్రణలు అమల్లోకి రానుండగా..నవంబర్‌ నుంచి వాచీ దుకాణాలు, ఆప్టిక్స్‌ స్టోర్స్‌లో విదేశీ ఉద్యోగులు పని చేయడంపై నియంత్రణలు విధిస్తారు. ఇక వచ్చే ఏడాది జనవరి 7 నుంచి వైద్య పరికరాల దుకాణాలు, భవన నిర్మాణ సామాగ్రి దుకాణాలు, ఆటో విడిభాగాల స్టోర్స్‌, కార్పెట్‌ దుకాణాలు, స్వీట్‌ షాపుల్లో విదేశీ ఉద్యోగులు పని చేయడంపై నియంత్రణలు అమల్లోకి రానున్నాయి. వీటిల్లో పని చేసే అత్యధికులు తక్కువ వేతనాలతో కూడి వివిధ వృత్తుల్లో పనిచేసే కార్మికులే కావడం గమనార్హం.