దేశీయ రెండో అతిపెద్ద బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్లో అతిపెద్ద కుంభకోణం జరిగింది. ముంబై బ్రాంచ్లో సుమారు రూ. 11,359 కోట్ల మోసపూరిత లావాదేవీలు జరిగినట్టు స్వయంగా పీఎన్బీ బాంబే స్టాక్ ఎక్సేంజ్కు సమాచారం అందించింది. ఈ లావాదేవీల ఆధారంగా ఆయా ఖాతాదారులకు విదేశాల్లో రుణాలు జారీ అయినట్టు వివరించింది.
అనధికారిక, మోసపూరిత లావాదేవీలు కొందరు ఖాతాదారుల ప్రయోజనాల కోణంలో జరిగినట్టు గుర్తించామని పేర్కొంది. ఈ కుంభకోణంలో భాగంగా 10 మంది ఉద్యోగులను పీఎన్బీ సస్పెండ్ చేసినట్టు బ్యాంకింగ్ సెక్రటరీ రాజీవ్ కుమార్ తెలిపారు. దీనిపై సీబీఐ విచారణ చేపట్టింది. మొండి బకాయిలను గుర్తించడానికి ఈ విచారణ సహకరిస్తుందని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు.
ఇదిలా వుండగా పంజాబ్ నేషనల్ బ్యాంకు షేర్లు బుధవారం మధ్యాహ్నం అమాంతం పడిపోయాయి. రూ.160 షేరు విలువతో బీఎస్ఈలో ట్రేడింగ్ ప్రారంభించిన పీఎన్బీ మధ్యాహ్నం ఒంటి గంట సమయానికి 8శాతం పడిపోయింది. ప్రస్తుతం ఆ బ్యాంక్ షేరు విలువ రూ.150 వద్ద కొనసాగుతోంది. బ్యాంకు షేర్లు ఈ మేర నష్టపోతుండటంతో, పీఎన్బీ ఇన్వెస్టర్లు ఒక్కరోజులోనే దాదాపు రూ.3వేల కోట్ల సంపదను కోల్పోవడం గమనార్హం.